
ఆపరేషన్ సిందూర్ ఆ విధంగానే చరిత్రలో నిలిచిపోతుంది
స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన ముర్ము
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదుల పాశవిక దాడికి దీటైన జవాబుగా ఉగ్రస్థావరాలను నేలమట్టంచేస్తూ భారత్ సర్కార్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శ్లాఘించారు. రక్షణరంగంలో స్వావలంబన దిశలో దూసుకెళ్తున్న భారత్‌ను రాష్ట్రపతి మెచ్చుకున్నారు. 79వ స్వాతంత్య్రదినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం రాష్ట్రపతి ముర్ము జాతినుద్దేశించి ప్రసంగించారు. కీలకాంశాలు ఆమె మాటల్లోనే..
మానవీయ పోరాటానికి మచ్చుతునక
సెలవుల్లో సరదాగా గడిపేందుకు పహల్గాంలోని లోయ ప్రాంతానికి వచ్చిన అమాయకుల ప్రాణాలను ఉగ్రవాదులు పొట్టన బెట్టుకోవడం అత్యంత అమానవీయం. దీనికి దీటైన జవాబిస్తూ సరిహద్దు వెంట, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో భారత త్రివిధదళాలు అత్యంత కచ్చిత త్వంతో, సాంకేతిక సామర్థ్యంతో ఉగ్రస్థావరాలను నేలమట్టం చేశారు. ఉగ్రవాదంపై మానవత్వం చేసిన పోరాటానికి ఆపరేషన్ సిందూర్ ఒక ప్రబల నిదర్శనం. ఉగ్రవాదంపై అంతర్జాతీయ పోరులో ఆపరేషన్ సిందూర్ ఒక కీలక ఘట్టంగా నిలిచి పోతుంది. రక్షణరంగంలో ‘ఆత్మనిర్బర్ భారత్’ విజయానికి ఆపరేషన్ సిందూర్ కొలమానం.
అవినీతిని సహించలేని సుపరిపాలన
ప్రజాస్వామ్య వృక్షానికి అవినీతి, వంచన ఫలాలు కాయొద్దని గాంధీ హెచ్చరించారు. ఆయన ఆదేశా లను శిరసావహిస్తూ దేశం నుంచి అవినీతిని కూకటి వేళ్లతో పెకలించాలి. అవినీతిని సహించలేని సుపరి పాలన కావాలి. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ వంటికి స్వదేశీ స్ఫూర్తిని కొనసాగిస్తున్నాయి. దేశీయ ఉత్ప త్తులను కొందాం, వినియోగిద్దాం అని సంకల్పం తీసుకుందాం.
కశ్మీర్ రైలుతో పర్యాటకం, వాణిజ్యం పైపైకి
కశ్మీర్ లోయలో చినాబ్ నదిపై నూతన రైలు వంతెన మన భారతీయ ఇంజనీరింగ్ అద్భుతం. అంజీఖడ్ తీగల వంతెన సైతం కీలకమైంది. చినాబ్ నది మీదుగా కశ్మీర్‌కు తొలిసారిగా నూతన రైళ్ల రాక పోకలు ఆరంభమై కశ్మీర్‌లో పర్యాటకం, వాణిజ్యం మరింత ఊపందుకుంటోంది. రైళ్లు అక్కడికి కొత్త ఆర్థిక అవకాశాలను మోసుకొస్తాయి. రైల్వే అనుసంధానంతో ఆ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి బాటలు పడుతున్నాయి.