
వినాయకుడు.. అనగానే ఎవరికైనా ముందుగా పెద్ద బొజ్జ, తొండంతో కూడిన విచిత్ర ఆకృతి గుర్తుకు వస్తుంది. అయితే దీనికి భిన్నంగా మానవముఖంతో ఉండే ఏకైక వినాయక ఆలయం ఎక్కడుందో తెలుసా? వినాయక చవితి వేళ ఈ ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి. భక్తులు విఘ్నేశ్వరుని దర్శనం కోసం బారులు తీరుతారు.
తమిళనాడులోని తిలతర్పణపురిలో నరముఖ గణపతి ఆలయం ఉంది. కూతనూరు పట్టణానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆది వినాయక దేవాలయం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. మానవముఖం కలిగిన ఏకైక వినాయక ఆలయంగా ఈ ఆలయం గుర్తింపు పొందింది. విఘ్నేశ్వరునికి ఏనుగు తల పెట్టకముందు గణేశుని అసలు ముఖం ఇదేనని భక్తులు నమ్ముతారు. ఇక్కడ గణపతిని నరముఖ వినాయకునిగా పూజిస్తారు. ఈ విగ్రహం 5 అడుగుల ఎత్తు ఉంటుంది. నడుము చుట్టూ నాగాభరణం కనిపిస్తుంది.
గ్రానైట్ తో నరముఖ గణపతి విగ్రహాన్ని రూపొందించారు. ఈ గణపతి.. గొడ్డలిని చేతితో పట్టుకుని దర్శనమిస్తాడు. మరోచేతిలో మోదకం ఉంటుంది. ఈ విగ్రహాన్ని 7వ శతాబ్దంలో తీర్చిదిద్దారని నమ్ముతారు. ఈ ఆలయం తమిళనాడులోని పురాతన దేవాలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి పొందింది. పురాణాలలోని వివరాల ప్రకారం గణేశుడిని పార్వతీదేవి సృష్టిస్తుంది. ఆ తర్వాత జీవం పోస్తుంది. పార్వతీదేవి ఒకరోజు స్నానానికి వెళ్లినప్పుడు గణేషుశుడిని తలుపు వద్ద కాపలాగా ఉంచుతుంది.
కొంత సేపటికి శివుడు గృహానికి రాగా, ఆ ప్రాంగణంలోకి వచ్చేందుకు శివుణ్ణి.. వినాయకుడు అనుమతించడు. దీంతో కోపోద్రిక్తుడైన శివుడు వినాయకుని తల నరుకుతాడు. విషయం తెలుసుకున్న పార్వతి.. శివునిపై ఆగ్రహిస్తుంది. అప్పుడు దేవతలంతా సమావేశమై, మానవముఖానికి బదులుగా పార్వతి తనయునికి ఏనుగు తలను పెట్టి బతికిస్తారు.