పాయింట్‌ బ్లాంక్‌లో గన్‌ ఉన్నా భయపడని వీర మహిళ

Neerja Bhanot Birthday Special Story - Sakshi

పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌లో గన్‌ ఉన్న బయటపడని నైజం ఆమెది. తనని షూట్‌ చేస్తారని తెలిసిన ప్రాణం కోసం కాళ్లమీద పడకుండా ఎదురొడ్డి పోరాడిన సాహసి ఆమె. వయసు కేవలం ఇరవై రెండు సంవత్సరాలు అయినా మనసు మాత్రం హిమాలయ శిఖరమంతా. తాను చనిపోతున్న సమయంలోనూ ముగ్గురు చిన్నారులకు రక్షణ కవచంలా నిలిచి మరీ మృత్యువును ఆహ్వానించిన త్యాగశీలి. ఆమె ఎవరో కాదు అతిచిన్న వయసులోనే ఎంతో ధైర్యసాహసాలు చూపి ఆశోకచక్ర అవార్డును పొందిన నీరజా భనోత్. సెప్టెంబర్‌5, 1986 భారతదేశంలో మర్చిపోలేని ఒక సంఘటన. విచక్షణారహితంగా ఉగ్రవాదులు విమానాన్ని హైజాక్‌ చేసి చాలా మంది ప్రాణాలను బలిగొన్న రోజు. ఆరోజే ఒక అపురూపమైన వ్యక్తి గురించి, ఆమె వ్యక్తిత్వం గురించి ప్రపంచానికి తెలిసిన రోజు. ఈ రోజు నీరజ భనోజ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆ రోజు జరిగిన సంఘటనను, ఆమె ధైర్యసాహసాలను ఒక్కసారి  గుర్తు చేసుకుందాం.  

సెప్టెంబర్ 5, 1986, ముంబై నుంచి కరాచీ మీదుగా న్యూయార్‌‌క వెళ్లాల్సిన విమానం మేఘాలను చీల్చుకుంటూ ముందుకు సాగిపోతోంది. సరిగ్గా ఉదయం 4:30కి కరాచీ విమానాశ్రయంలో దిగింది. అక్కడ దిగాల్సినవాళ్లు దిగారు. ఎక్కాల్సినవాళ్లు ఎక్కారు. విమానం మళ్లీ గాల్లోకి లేవనుంది. సరిగ్గా అప్పుడే మూడు సార్లు తుపాకి పేల్చిన చప్పుడు. ఒక్క సారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. ఎదురుగా ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ దుస్తులు వేసుకున్న నలుగురు సాయుధులు. తుపాకులు చూపిస్తూ అందరినీ చేతులు వెనక్కి పెట్టుకొమ్మని ఆదేశించారు. పెట్టుకున్నాక కట్టేశారు. చివరికి కెప్టెన్‌ని, కో-పెలైట్‌ని, కాక్‌పిట్ క్రూని కూడా బంధించారు. ఒకే ఒక్కరిని తప్ప. ఆమె నీరజా భనోత్. పంజాబ్‌లో పుట్టి, ఫ్లయిట్ అటెండెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న ఇరవ రెండేళ్ల యువతి.

హైజాకర్లు విమానం ఎక్కగానే క్రూ మెంబర్స్‌ని అలర్ట్‌ చేసింది నీరజ. దాంతో పైలట్లు తమ విజ్ఞానాన్ని ఉపయోగించి ఫ్లయిట్‌ను ఎగరకుండా చేశారు. ఆ తర్వాత విమానాన్ని హైజాక్ చేయాలన్న దుండగుల పథకం ఫెయిలైంది. దాంతో వాళ్ల కోపం కట్టలు తెంచుకుంది. సైప్రస్‌కు విమానంతో సహా వెళ్లి, అక్కడ జైల్లో ఉన్న తమవారిని విడుదల చేయించాలన్న ప్లాన్ బెడిసి కొట్టడంతో ఆ ప్రతాపం ప్రయాణికుల మీద చూపించడం మొదలు పెట్టారు. కొందరిని చంపేశారు. మిగిలిన వాళ్ల పాస్‌పోర్టులు సేకరించమని నీరజకు పురమాయించారు. అయితే అందరిని సౌకర్యంగా ఉంచే ఆమె, ఇప్పుడు అందరినీ ఎలా కాపాడాలా అన్న ఆలోచనలో పడింది. ధైర్యం ఆమె నరనరాల్లో ఉంది. 

కొంతమంది పాస్ పోర్టులు దాచేసింది. ఉగ్రవాదులు కొందరిని హింసించబోతే అడ్డుకుంది. వాళ్లను కట్టడి చేసేందుకు పదిహేడు గంటలపాటు ప్రయత్నించింది. కానీ చివరికి ఉగ్రవాదులు సహనం కోల్పో యారు. విచక్షణా రహితంగా కాల్పులు జరపడం మొదలుపెట్టారు. దాంతో ఎమర్జెన్సీ ద్వారం గుండా ప్రయాణికుల్ని తప్పించే ప్రయత్నం మొదలుపెట్టింది నీరజ. ఆ విషయాన్ని ఉగ్రవాదులు పసిగట్టేశారు. అందుకు శిక్షగా ఆమె ప్రాణాలనే తీసేసుకున్నారు. నీరజ మరణం అందర్నీ కలచి వేసింది.

ఆ రోజు ప్రాణాలతో బయటపడిన వాళ్లంతా ఇప్పటికీ నీరజను తలచుకుని కన్నీళ్లు పెట్టుకుంటారు. ఉగ్రవాదులు ఫ్లయిట్ ఎక్కేటప్పటికి ఎంట్రన్స్ దగ్గర ఉన్న నీరజకు పారిపోయే అవకాశం ఉన్నా పారిపోలేదని చెబుతుంటారు. అందుకే ఆమె జీవిత చరిత్ర ఆధారంగా సోనమ్‌ కపూర్‌ హీరోయిన్‌గా ‘నీర్జా’ సినిమాను తెరకెక్కించారు. ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌ అయ్యింది. ఈ సినిమా ఆరోజు జరిగిన ప్రతి సంఘటనను కళ్లకు కట్టినట్టు చూపించింది. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరు నీరజ ధైర్య సాహసాలను కొనియాడారు. ఎంతో మందికి నీరజ ఆదర్శంగా నిలిచారు.  (యూనిఫామ్‌లో.. శాంతి పావురం!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top