
న్యూఢిల్లీ: మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తన అధికార నివాసం నుంచి ఛతర్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ ఫాం హౌస్‌కు మకాం మార్చారని అధికారులు తెలిపారు. జూలై 21న పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి పార్లమెంట్ హౌస్ సమీపంలోని ఉపరాష్ట్రపతి అధికార నివాసంలోనే ఉంటున్నారు.
నిబంధనల ప్రకారం మాజీ ఉపరాష్ట్రపతికి టైప్–8 అధికార బంగ్లాను సిద్ధం చేసే వరకు తాత్కాలికంగా ఐఎన్‌ఎల్‌డీ నేత అభయ్ చౌతాలాకు చెందిన గడాయ్‌పూర్‌లోని ఫాంహౌస్‌లో ఉంటారని అధికారులు వివరించారు. అనారోగ్య కారణాలు చూపుతూ ఆకస్మికంగా పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి ధన్‌ఖడ్ బయటకు రాకపోవడం గమనార్హం. తీరిక వేళల్లో కుటుంబ సభ్యులతో గడుపుతున్నారని, టేబుల్ టెన్నిస్ ఆడుతూ యోగ సాధన చేస్తున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.