
శ్రీనగర్: భారీ వర్షాల నేపథ్యంలో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, ఏకంగా 68 రైళ్లను క్యాన్సిల్ చేసింది. వర్షాల తాకిడి జమ్ముకశ్మీర్‌లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న నేపధ్యంలో రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
భారీ వర్షాల కారణంగా జమ్ము- కత్రా స్టేషన్ల నుండి రాకపోకలు సాగించే 68 రైళ్లను సెప్టెంబర్ 30 రద్దు చేసినట్లు భారత రైల్వే శాఖ తెలిపింది. భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా, జమ్ము రైల్వే డివిజన్‌లో గత ఎనిమిది రోజులుగా టైల్ ట్రాఫిక్ నిలిపివేశారు. పఠాన్‌కోట్-జమ్ము సెక్షన్‌లోని పలు చోట్ల ట్రాక్‌లపై పగుళ్లు ఏర్పడ్డాయి. ఆగస్టు 26 నుండి జమ్ము ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వేలాది మంది, ముఖ్యంగా యాత్రికులు ఇక్కడ చిక్కుకుపోయారు. కాట్రాలోని మాతా వైష్ణో దేవి మందిరం సమీపంలో కొండచరియలు విరిగిపడి 34 మంది ప్రాణాలు కోల్పోయారు.
జమ్ములో చిక్కుకుపోయిన ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వేశాఖ పలు ప్రత్యేక రైలు సర్వీసులు నడుపుతోంది. మరోవైపు లోయలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మంగళవారం సాయంత్రం కశ్మీర్ లోయలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయని అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణ సూచన దృష్ట్యా విభాగాలన్నీ అప్రమత్తంగా ఉన్నాయన్నారు. జీలం నది, ఇతర నీటి వనరులు వరద హెచ్చరిక స్థాయి కంటే ప్రస్తుతానికి తక్కువగానే ప్రవహిస్తున్నాయని తెలిపారు.