కరోనా కట్టడిపై రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు

Centre Rules For States On Lockdowns - Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి లాక్‌డౌన్‌, కంటైన్‌మెంట్‌ జోన్లను అమలు చేయడంపై రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా పాజిటివిటీ రేటు వారానికి 10 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు, ఆసుపత్రుల్లో పడకలు 60 శాతానికి పైగా భర్తీ అయినప్పుడు ఈ పరిమితులను విధించాలని స్పష్టం చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేర్కొన్న నిబంధనల ప్రకారం  జిల్లా, నగర ప్రాంతాల్లో కరోనా కేసులు అధికంగా ఉన్న ప్రాంతాలను ఇంటెన్సివ్, లోకల్, ఫోకస్డ్ కంటైన్‌మెంట్‌ జోన్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కోరింది.

లాక్‌ డౌన్ అనేది ఎప్పుడు, ఎక్కడ పెట్టాలన్న విషయాన్ని కరోనాతో ప్రభావితమైన జనాభా, భౌగోళిక వ్యాప్తి, ఆ ప్రదేశంలో ఉండే ఆసుపత్రి మౌలిక సదుపాయాలు, మానవశక్తి , ఇతర వనరులను దృష్టిలో ఉంచుకొని,  విశ్లేషణలను ఆధారంగా చేసుకోవాలని సూచించింది. ఈ ప్రాంతాలను "పెద్ద కంటైన్‌మెంట్‌ జోన్" పిలువవచ్చునని హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను విధించడంపై విస్తృత మార్గదర్శకాలను ఇచ్చామని గుర్తుచేసింది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో కనీసం 14 రోజులపాటు ఆంక్షలు అమలు చేయాలని తెలిపింది.

కంటైన్‌మెంట్‌ జోన్లను గుర్తించిన తర్వాత కరోనా నియంత్రణ కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీచేసిన సూచనలు:

  • నైట్ కర్ఫ్యూ - రాత్రిపూట అత్యవసర సేవలను మినహాయించి, మిగతా వాటిని పూర్తిగా బంద్‌ చేయాలి. నైట్‌ కర్ఫ్యూ సమయాన్ని స్థానికంగా ఉండే  పరిపాలన అధికారులు నిర్ణయించాలి.
  • ప్రజల కదలిక ఎక్కువగా ఉండే రాజకీయ, క్రీడ, వినోద, విద్యా, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలను పూర్తిగా నిషేధించాలి. ఇతర సమావేశాలు కూడా పూర్తిగా నిషేధం. ప్రజలు ఒకచోట ఉండకుండా చేయడం ద్వారా కరోనా వ్యాప్తిని నియంత్రించవచ్చు. 
  • వివాహ వేడుకలకు కేవలం 50 మంది పాల్గొనేలా చూడాలి. అంత్యక్రియల్లో  20 మంది ఉండేలా చూడాలి.
  • షాపింగ్ కాంప్లెక్స్, సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు, బార్‌లు, స్పోర్ట్స్ కాంప్లెక్సులు, జిమ్, స్పా సెంటర్లు, స్విమ్మింగ్ పూల్స్‌ మూసివేయాలి. మతపరమైన ప్రదేశాలను కూడా మూసివేయాలి.
  • ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో కేవలం అవసరమైన సేవలు మాత్రమే కొనసాగాలి.
  • రైల్వేలు, మెట్రోలు, బస్సులు, క్యాబ్‌లు వంటి ప్రజా రవాణాలో వాటి సామర్థ్యంలో సగం వరకు మాత్రమే ప్రయాణించేలా చూసుకోవాలి.
  • అంతర్రాష్ట్ర రవాణాకు ఎటువంటి అడ్డంకులు లేవు.
  • కార్యాలయాలు కేవలం సగం మంది సిబ్బందితో పనిచేసేలా చూసుకోవాలి.
  • పారిశ్రామిక, శాస్త్రీయ సంస్థలు భౌతిక దూరాన్ని పాటిస్తూ కార్యకలాపాలను జరపవచ్చు. ఈ సంస్థల్లో పనిచేసేవారికి ఎప్పటికప్పుడు రాపిడ్ యాంటిజెన్ టెస్టులు నిర్వహించాలి. 

కరోనా తీవ్రతను జాగ్రత్తగా విశ్లేషించి రాష్ట్రాలే స్వంతంగా నిర్ణయించుకోవాలని కేంద్రం చెబుతోంది. కోవిడ్-19కు అంకితమైన ఆసుపత్రులకు సీనియర్ జిల్లా అధికారులను నియమించాలని,  రోగులను సజావుగా మార్చడానికి ఒక యంత్రాంగాన్ని రూపొందించాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలను ఇచ్చింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top