‘రాజద్రోహాన్ని’ లెక్కచేయలేదు, కటకటాలనూ లెక్క చేయలేదు

Azadi Ka Amrit Mahotsav Freedom Fighter V O Chidambaram Pillai - Sakshi

వి.ఓ. చిదంబరం పిళ్లైకి యావజ్జీవ కారాగార శిక్ష పడడంతో, దానికి నిరసనగా ప్రజలంతా గుమిగూడారు. దీన్ని చూసి బ్రిటిష్‌ అధికారికి చిర్రెక్కింది. అతని తుపాకీకి పిచ్చెక్కడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు గాయపడ్డారు. అంతే. గాడిచర్లకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ‘‘అరెరె ఫిరంగీ! క్రూర వ్యాఘ్రమా! ఓ భయభ్రాంతుడా! పొగరుబోతు’’ అంటూ ‘విపరీత బుద్ధి’ శీర్షికన సంపాదకీయం రాశారు.

‘రాజద్రోహాన్ని’ లెక్కచేయలేదు, కటకటాలనూ లెక్క చేయలేదు, హింసనూ లెక్క చేయలేదు. స్వాతంత్య్రోద్యమం కోసం ఎంతో మంది పాత్రికేయులు అక్షరాయుధాలుగా తయారయ్యారు. తిలక్‌ (కేసరి, మరాఠా), సుబ్రమణ్య అయ్యర్‌ (ద హిందూ), శిశిర్‌ కుమార్‌ ఘోష్, మోతీలాల్‌ ఘోష్‌ (స్వదేశీయాభిమాని), మోతీలాల్‌ నెహ్రూ, మదన్‌మోహన్‌ మాలవ్య(ద లీడర్‌), గాంధీ (దక్షిణాఫ్రికాలో ‘వాయిస్‌ ఆఫ్‌ ఇండియా’కు కరస్పాండెంట్‌) వంటి జాతీయోద్యమ నాయకుల జీవితాలు పత్రికలతో పెనవేసుకునే మొదలయ్యాయి. దేశంలో తొలిసారిగా జైలుకెళ్లిన పాత్రికేయుడు సురే్రందనాథ్‌ బెనర్జీ. తెలుగునాట సంపాదకీయం రాసి  జైలు జీవితాన్ని గడిపిన తొలి పాత్రికేయుడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు.  తొలి తెలుగు దినపత్రిక ‘ఆంధ్రపత్రిక’కు ఆయన తొలి సంపాదకుడు.

‘గాడి’ తప్పిన ఆగ్రహం
గాడిచర్ల హరిసర్వోత్తమ రావు తండ్రి నేటి వైఎస్‌ ఆర్‌ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురానికి చెందిన వారు.  కర్నూలులో 1883లో జన్మించిన ఆయన, మద్రాసులో ఎం.ఏ., పూర్తి చేసి, రాజమండ్రిలో బీఈడీలో చేరారు. బెంగాల్‌ విభజనకు వ్యతిరేకంగా జరిగిన ‘వందేమాతర’ ఉద్యమంలో అక్కడి విద్యార్థులంతా తరగతులను బహిష్కరించారు. విద్యార్థులకు జరిమానాతో సరిపెట్టిన ప్రిన్సిపాల్, వారికి నాయకత్వం వహించిన గాడిచర్లను కాలేజీ నుంచి బహిష్కరించి, ఎక్కడా ప్రభుత్వ ఉద్యోగంలో చేరకుండా ఆదేశాలు జారీ చేశారు. గాడిచర్ల ఏడాది తరువాత విజయవాడ వచ్చి ‘స్వరాజ్య’ పత్రికను స్థాపించారు. అదే సమయంలో తమిళనాడులో వి.ఓ. చిదంబరం పిళ్లైకి యావజ్జీవ కారాగార శిక్ష పడడంతో, దానికి నిరసనగా ప్రజలంతా గుమిగూడారు. దీన్ని చూసి బ్రిటిష్‌ అధికారికి చిర్రెక్కింది. అతని తుపాకీకి పిచ్చెక్కడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు గాయపడ్డారు. అంతే. గాడిచర్లకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

జడ్జికి ‘అభిమాన’ భంగం
‘‘అరెరె ఫిరంగీ! క్రూర వ్యాఘ్రమా! ఓ భయభ్రాంతుడా! పొగరుబోతు’’ అంటూ ‘విపరీత బుద్ధి’ శీర్షికన సంపాదకీయం రాసినందుకు ఆయనపైన రాజద్రోహ నేరం మోపారు. ఈ కేసులో మరిన్ని ఆధారాల కోసం భోగరాజు పట్టాభిసీతారామయ్య, అయ్యదేవర కాళేశ్వరరావుల ఇళ్లలో కూడా పోలీసులు సోదాలు చేశారు. ఆ సమయంలోనే బాలగంగాధర్‌ తిలక్‌ పైన బొంబాయిలో రాజద్రోహ నేరం కేసు విచారణ జరుగుతోంది. ‘విపరీత బుద్ది’ తోపాటు ‘స్వరాజ్య’ లో వచ్చిన మిగతా వ్యాసాలు రోజద్రోహం కిందకు రావని, భారతీయుడైన కృష్ణా జిల్లా సెషన్స్‌ జడ్జి కెర్షాస్ప్‌ (పారశీ మతస్తుడు) కేవలం 6 నెలల సాధారణ శిక్షతో సరిపెట్టారు. గాడిచర్ల పైన అభిమానంతో శిక్షను తగ్గించి విధించారని భావించిన మద్రాసు హైకోర్టు జడ్జిలు కెర్షాస్ప్‌ పదవీ స్థాయిని తగ్గించేశారు. మరొక సారి పదవీ స్థాయిని తగ్గించడంతో ఆయన రాజీనామా చేసి వెళ్లిపోయారు. హైకోర్టులో గాడిచర్ల తరపున ప్రకాశం పంతులు వాదించినప్పటికీ, మూడేళ్ల కఠిన కారాగార శిక్ష తప్పలేదు.

మొలకు గోచి.. తలకు టోపీ
ఆ సమయంలో గాడిచర్ల వయసు పాతికేళ్లు. ఆయన సతీమణి రామాబాయి వయసు పదిహేనేళ్లు. ఆమె ఏడు నెలల గర్భవతి. జైల్లో ఉన్న భర్తను దూరం నుంచి చూసి చలించిపోయారు.  మొలకు గోచీ,  గుండు చేసిన తలకు మురికి టోపీ, కాళ్లకు, చేతులకు, మెడకు ఇనుప కడియాలు, మట్టి ముంతలో నీళ్లు, మట్టి చిప్పలో మట్టిపెళ్లలు, రాళ్లతో నిండిన రాగి సంగటి. పిండి విసరడం, రాళ్లు కొట్టడం ఆయన దినచర్య. మట్టితో పళ్లు తోముకోవడం, జైలరు చెప్పిన సమయానికి మలవిసర్జన, స్నానానికి 4 ముంతల నీళ్లు; ఇలా దేహబలాన్నే కాదు, మనో బలాన్ని కూడా దెబ్బతీయాలని చూసినా వారికి సాధ్యం కాలేదు. ఆ తరువాత గాడిచర్ల ‘నేషనలిస్టు’ అన్న ఇంగ్లీషు పత్రికను స్థాపించి, రౌలత్‌ చట్టం, చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణలు, ప్రెస్‌ యాక్ట్‌ను నిశితంగా విమర్శిస్తూ ‘కట్‌ ఆఫ్‌ ద బుల్లెట్‌’ అన్న సంపాదకీయం రాశారు. దీంతో ఆయనపై మళ్ళీ రాజద్రోహ నేరం మోపారు. ఈ తడవ జైలు శిక్షపడలేదు కానీ, పత్రికను మూసేశారు. ‘నేషనలిస్టు’లో కందుకూరి వీరేశలింగం, కట్టమంచి రామలింగా రెడ్డి వంటి వారు కూడా  వ్యాసాలు రాసేవారు. జైలు నుంచి విడుదలైన గాడిచర్లతో మాట్లాడడానికి ఎవరూ సాహసించే వారు కాదు. ఆ స్థితిలో కాశీనాథుని నాగేశ్వరరావు 1914లో మద్రాసులో తెలుగు వారి తొలి దినప్రతికగా ఆంధ్రపత్రికను స్థాపించి గాడిచర్లను సంపాదకులుగా నియమించారు.
– రాఘవ శర్మ


గాడిచర్ల హరిసర్వోత్తమరావు

చదవండి: ఫడ్కే.. ఇప్పుడు నీకేం కావాలి? నీతో యుద్ధం.. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top