
మానవతావాద రచయిత్రి
ఇస్మత్ చుగ్తాయ్‌కి వంటపని, ఇంటి పని ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. వంటింటికే పరిమితం కావడం ఎంతమాత్రం సరికాదని ఏడెనిమిది దశాబ్దాల నాడే భావించిన భావుకురాలు! పదిమంది సంతానంలో ఈ ఒక్క అమ్మాయే ఇలాంటి తిరుగుబాటు ధోరణి ప్రదర్శించడం ఆ తల్లిని కలచి వేసేది. కానీ తండ్రి, ఒక సోదరుడి మద్దతు ఉండేది. ముస్లింల ఇంట పుట్టినా ఆమె ఆ ఆచారాలు పాటించడానికి అంగీకరించలేదు. ఇస్లాం ఆచారాలను పరిపూర్ణంగా పాటించే ఆగ్రా వంటి చోటకు వెళ్లినా బుర్ఖా ధరించలేదు. చాలామందికి ఇష్టం లేకున్నా బీఏ, తరువాత ఆగ్రాలో బీటీ కూడా పూర్తి చేశారామె. దేశంలో బీటీ పట్టా తీసుకున్న తొలి మహిళ చుగ్తాయ్.
ఆగ్రాలో చదువుకుంటున్నప్పుడే అక్కడ మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న షాహిద్ లతీఫ్‌తో పరిచయమైంది. అది ప్రణయంగా మారి, వివాహం చేసుకున్నారు. రష్యన్ రచయితలను, ఇంగ్లిష్ రచయితలను అపారంగా చదివిన ఇస్మత్‌కు రచనలు చేయాలన్న ఆలోచన ఆజీమ్‌ను చూశాకే వచ్చింది. ఆనాటికే అతడు రచయిత. అయితే ఆమె రచనకు ఒక దృక్పథం ఏర్పడడానికి కారణం.. 1936లో జరిగిన లక్నో అభ్యుదయ రచయితల సమావేశం. ఉర్దూ మహా రచయిత మున్షీ ప్రేమ్‌చంద్ రోజులను లెక్కిస్తూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశమే భారతీయ సాహిత్యానికి కొత్త దిశను చూపించింది.
ఎన్నో నవలలు, కథలు, రేడియో నాటికలు రాశారామె. ‘జిద్ది’, ‘తేడీ లకీర్’, ‘ఏక్‌బాత్’, ‘మాసూమా’, ‘దిల్ కీ దరియా’, ‘ఏక్ ఖత్రా ఏ ఖూన్’, ‘ఇన్సాన్ ఔర్ ఫరిష్టే (నవలలు, నవలికలు); ‘ధనీ బాంకే’, షైతాన్ (నాటికలు, రేడియో నాటికలు), ‘కలియా’, ‘దో హాథ్’, ‘చోటే’(కథా సంకలనాలు), ‘కాగజి హై పైరహన్’ (ఆత్మకథ) ఆమె రచనలలో కొన్ని. గరం హవా, అర్జూ, మైడ్రీమ్స్, లీహాఫ్ ఆమె కథల ఆధారంగా తీసిన చిత్రాలే. రచయిత్రిగా చుగ్తాయ్ ఎంతటి ఉన్నత శిఖరాలను అధిరోహించారో చెప్పడానికి ఒక్క ‘లిహాఫ్’ కథ చాలు. ఈ కథే ఆమెను బోను కూడా ఎక్కించింది. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం అశ్లీలత ఆరోపణతో లాహోర్ కోర్టులో కేసు నడిపింది. ఆమెతో పాటు మరో కథ కారణంగా అప్పుడే విచారణను ఎదుర్కొన్న రచయిత సాదత్ హసన్ మంటో. ఇద్దరూ కేసుల నుంచి బయటపడ్డారు. మిత్రులయ్యారు. చుగ్తాయ్ ఉత్తర ప్రదేశ్‌లోని బదయూన్‌లో జన్మించారు. ముంబైలో కన్నుమూశారు.