
దేశాన్ని నక్సల్స్‌రహితంగా మార్చడానికి కట్టుబడి ఉన్నాం
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పషీ్టకరణ
‘ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్’లో పాల్గొన్న జవాన్లకు సన్మానం
న్యూఢిల్లీ/సుక్మా: నక్సలైట్లపై కఠినంగా వ్యవ హరించక తప్పదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. దేశంలో నక్సలైట్లు అందరూ లొంగిపోవడమో లేక వారిని పూర్తిగా అదుపులోకి తీసుకోవడమో లేక సమూలంగా అంతం చేయడమో జరిగే దాకా నరేంద్ర మోదీ ప్రభుత్వ విశ్రమించబోదని తేల్చిచెప్పారు. చత్తీస్‌గఢ్‌లోని కర్రెగుట్టపై నక్సలైట్లకు వ్యతిరేకంగా ‘ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్’ను విజయవంతంగా నిర్వహించిన సీఆర్‌పీఎఫ్, జిల్లా రిజర్వ్ గార్డ్(డీఆర్‌జీ), కోబ్రా జవాన్లతోపాటు చత్తీస్‌గఢ్ పోలీసులను అమిత్ షా బుధవారం ఢిల్లీలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశాన్ని నక్సల్స్ రహితంగా మార్చడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్‌లో మన జవాన్లు ప్రదర్శించిన ధైర్యసాహసాలు దేశంలో నక్సలైట్ వ్యతిరేక ఆపరేషన్లలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుందని ప్రశంసించారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ వీరోచితంగా పోరాటం సాగించారని, కర్రెగుట్టపై నక్సలైట్ల బేస్ క్యాంప్‌ను ధ్వంసం చేశారని తెలిపారు. అడుగడుగునా పేలుడు పదార్థాల(ఐఈడీ) ముప్పును తప్పించుకుంటూ ముందుకెళ్లారని చెప్పారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్టుతో తీవ్రవాదులకు కోలుకోలేని దెబ్బ తగిలిందని అమిత్ షా వెల్లడించారు. అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధిని వారు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. పాఠశాలల, ఆసుపత్రులను ధ్వంసం చేస్తున్నారని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందకుండా కుట్రలు సాగిస్తున్నారని ఆరోపించారు.
పశుపతినాథ్ నుంచి తిరుపతి దాకా..
ప్రభుత్వం చేపట్టిన నక్సలైట్ల వ్యతిరేక ఆపరేషన్లతో 6.5 కోట్ల మంది జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసరిస్తున్నాయని అమిత్ షా వ్యాఖ్యానించారు. తీవ్రవాదుల పీడ విరగడువుతుండడంతో పశుపతినాథ్ నుంచి తిరుపతి దాకా ప్రజలు లబ్ధి పొందుతున్నారని వివరించారు. నక్సలైట్లపై పోరాటంలో గాయపడిన భద్రతా సిబ్బందికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని హమీ ఇచ్చారు. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ నాటికి నక్సలిజాన్ని అంతం చేయడమే తమ ఆశయమని స్పష్టంచేశారు. సన్మాన కార్యక్రమంలో చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, ఉప ముఖ్యమంత్రి విజయ శర్మ తదితరులు పాల్గొన్నారు.
చత్తీస్‌గఢ్‌లో 20 మంది నక్సలైట్లు లొంగుబాటు
చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో 20 మంది నక్సలైట్లు లొంగిపోయినట్లు పోలీసు అధికారులు బుధవారం తెలియజేశారు. వీరిలో 11 మందిపై మొత్తం రూ.33 లక్షల బహుమానం ఉన్నట్లు చెప్పారు. లొంగిపోయిన వారిలో తొమ్మిది మంంది మహిళలు ఉన్నారు. పీపుల్స్ లిబరేషర్ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) బెటాలియన్ నెంబర్ వన్‌కు చెందినవారు సైతం ఉన్నట్లు వెల్లడించారు. మావోయిస్టు సిద్ధాంతాల్లోని డొల్లతనం అర్థం కావడంతోపాటు అమాయక గిరిజనులపై మావోయిస్టుల అకృత్యాలు నచ్చక 20 మంది లొంగిపోయారని జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ పేర్కొన్నారు. మావోయిస్టుల్లో అంతర్గత కలహాలు సైతం లొంగుబాటుకు కారణమయ్యాయని వివరించారు. చత్తీస్‌గఢ్ ప్రభుత్వం ప్రారంభించిన నియాద్ నెల్లనార్(మీ మంచి గ్రామం) పథకం పట్ల నక్సలైట్లు ఆకర్శితులు అవుతున్నారని, అందుకే లొంగిపోవడానికి ముందుకొస్తున్నారని స్పష్టంచేశారు. ఈ పథకం కింద ప్రభుత్వం మారుమూల గ్రామాలను అభివృద్ధి చేస్తోంది. లొంగిపోయిన వారికి పునరావాసం కలి్పస్తోంది. వారికి తొలుత రూ.50 వేల చొప్పున నగదు అందజేస్తోంది. అనంతర ఇతర ప్రయోజనాలు కలి్పస్తోంది.