నీట్, జేఈఈ వాయిదాకు రివ్యూ పిటిషన్‌! | Sakshi
Sakshi News home page

నీట్, జేఈఈ వాయిదాకు రివ్యూ పిటిషన్‌!

Published Sat, Aug 29 2020 2:56 AM

6 States File Review Petition Against Supreme Court - Sakshi

న్యూడిల్లీ: జేఈఈ, నీట్‌ పరీక్షలను యథాత«థంగా నిర్వహించాలన్న తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ ఆరు రాష్ట్రాలు సుప్రీంకోర్టులో రివ్యూపిటిషన్‌ వేశాయి. పరీక్షలు నిర్వహించాలన్న తీర్పు విద్యార్థుల జీవించే హక్కుకు విఘాతమని, అదేవిధంగా ప్రస్తుత సంక్షోభ సమయంలో రవాణా ఇబ్బందులను ఆ తీర్పులో పరిగణించలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, మహారాష్ట్రకు చెందిన మంత్రులు మోలాయ్‌ ఘటక్, రామేశ్వర్‌ ఓరాన్, రఘుశర్మ, అమర్జీత్‌ భగత్, బీఎస్‌ సిద్ధు, ఉదయ్‌ రవీంద్ర సావంత్‌ తరఫున న్యాయవాది సునీల్‌ ఫెర్నాండెజ్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.

పరీక్షలు యథాత«థంగా నిర్వహించాలని, కరోనా కారణంగా జీవితాలు ఆగవని ఈ నెల 17న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో కేంద్రం పరీక్షల నిర్వహణకు సిద్ధ్దమైంది. అప్పటినుంచి ఈ విషయం రాజకీయ రంగు పులుముకుంది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పరీక్షలు వాయిదా వేయాలని కాంగ్రెస్‌ సహా విపక్షాలు డిమాండ్‌ చేయడం మొదలుపెట్టాయి. అయితే ప్రభుత్వం పరీక్షల నిర్వహణకే ముందుకు సాగడంతో విపక్ష రాష్ట్రాల మంత్రులు సుప్రీంను ఆశ్రయించారు. సెప్టెంబర్‌ 1–6లో జేఈఈ, సెప్టెంబర్‌ 13న నీట్‌ పరీక్షలు నిర్వహించేందుకు ఎన్‌టీఏ సమాయత్తమయింది. ఇప్పటికే అడ్మిట్‌కార్డుల డౌన్‌లోడ్‌ ప్రక్రియను ఆరంభించింది.  

అభ్యర్థులకే కాదు... కుటుంబాలకు కూడా రిస్కే
పరీక్షలు జరపాలన్న నిర్ణయం అసంబద్ధమని, జిల్లాలో పరీక్షా కేంద్రాల సమీక్షకు కేంద్రానికి తగిన సమయం ఉన్నా పట్టించుకోలేదనే విషయాన్ని తీర్పులో ప్రశ్నించలేదని రివ్యూపిటిషన్‌లో పేర్కొన్నారు. లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు రిజిస్టర్‌ చేసుకోవడం వారంతా పరీక్షకు ప్రస్తుతం హాజరయ్యేందుకు సమ్మతించినట్లు కాదని తెలిపారు. ఆగస్టు 17న ఇచ్చిన ఆదేశం ఈ విషయానికి సంబంధించిన అన్ని అంశాలను పట్టించుకోలేదన్నారు.

‘‘జీవితాలు ముందుకు సాగాలి, విద్యార్థులు ఒక విద్యాసంవత్సరం నష్టపోకూడదు’’ అనే రెండు అంశాల  ఆధారంగా తీర్పునిచ్చారని, అంతేకాని నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలను కూలంకషంగా చర్చించలేదని పిటి షన్‌లో వాదించారు. ఈ తీర్పును సమీక్షించకపోతే దేశ విద్యార్థి సమూహానికి తీవ్ర హాని జరగవచ్చని, కేవలం పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల ఆరోగ్యమే కాకుండా వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై కూడా పెను ప్రభావం చూపవచ్చని వివరించారు. 

ఇన్ని లక్షల మంది కరోనా సంక్షోభ సమయంలో అటుఇటు ప్రయాణాలు చేయడం తీవ్ర ఆరోగ్య సమస్యకు కారణమవుతుందన్నారు. ఈ ఒక్క కారణంతోనైనా గత తీర్పును రద్దు చేయవచ్చని కోరారు. కరోనా సమయంలలో కేంద్రానికి వ్యతిరేకంగా ఎలాంటి రాజకీయ విమర్శలు చేయదలుచుకోలేదని పిటిషనర్లు తెలిపారు. కరోనా  ఉధృతంగా ఉన్నప్పుడు నిర్వహించాలనుకోవడం సమంజసం కాదన్నారు.

Advertisement
Advertisement