పకడ్బందీగా రెండో విడత నామినేషన్ల ప్రక్రియ
నారాయణపేట: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రెండో విడత నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేలా అన్ని చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు సీతాలక్ష్మి తెలిపారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమెతోపాటు కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఎన్నికల సిబ్బంది కేటాయింపు, పోస్టల్ బ్యాలెట్ బ్యాలెట్ బాక్సులు, శాంతిభద్రతలు తదితర అంశాలపై సమీక్షించారు. జిల్లా ఎన్నికల పరిశీలకురాలు మాట్లాడుతూ.. ఎన్నికలను ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్, ఎస్‌ఎస్‌టీ, ఎంసీసీ, ఎన్నికల వ్యయ కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నామినేషన్ల పరిశీలన కూడా నిర్వహించడం జరిగిందన్నారు. కలెక్టర్ వివరిస్తూ జిల్లాలో ఎన్నికల నిర్వహణలో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని, ఎన్నికల నిర్వహణకు రాండమైజేషన్ ద్వారా ఎన్నికల సిబ్బందిని, అవసరమైన బ్యాలెట్ బాక్సులను కేటాయించామన్నారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం సమకూరుస్తున్నట్లు తెలియజేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నట్లు, మైక్రో అబ్జర్వర్ లను నియమించనున్నట్లు తెలిపారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలియజేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీ సంచిత్ గంగ్వార్, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కంట్రోల్‌రూం, మీడియా సెంటర్ పరిశీలన
కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను సోమవారం పరిశీలకురాలు సీతాలకీ్‌ష్మ్ సందర్శించారు. సంబంధిత సిబ్బందితో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి అధికారులకు అందించాలన్నారు. ప్రతిరోజు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్న వార్తలను పరిశీలించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌కు సంబంధించిన వార్తలను గుర్తించి సంబంధిత అధికారులకు తెలియజేయాలని అన్నారు.


