‘రెబల్స్’ గాయబ్..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: తొలిదశ పల్లె పోరు కీలక ఘట్టానికి చేరింది. బుధవారం నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు కాగా.. సాయంత్రం ఐదు గంటల తర్వాత బరిలో ఉండే అభ్యర్థులను ప్రకటించనున్నారు. అనంతరం వెంటనే ఆయా అభ్యర్థులకు గుర్తులు కేటాయించనున్నారు. అయితే అధికార కాంగ్రెస్ కు సంబంధించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధిక మొత్తం గ్రామపంచాయతీల్లో ఆ పార్టీ మద్దతుదారులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. నేడు ఉపసంహరణకు తుది గడువు కావడంతో ముఖ్యనేతలు తమను తప్పించే ప్రయత్నాలు చేస్తారని గ్రహించిన పలువురు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలిసింది. వారి ఆచూకీ కోసం ఎంత ప్రయత్నించినా దొరక్కపోవడంతో నేతలు తల పట్టుకుంటున్నారు. పలుచోట్ల ఇదివరకే బుజ్జగింపు ప్రయత్నాలు చేయగా.. వారు ఉపసంహరణకు ససేమిరా అన్నట్లు సమాచారం. తాజాగా వారు దొరక్కుండా తప్పించుకొని తిరుగుతుండడంతో పోటీలో నిలబడడం ఖాయంగా తెలుస్తోంది. ఈ పరిణామాలు ‘హస్తం’ ముఖ్య నేతలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. చేసేదేమీ లేక ఆయా గ్రామాల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలని దానిపై వారు కాంగ్రెస్ స్థానిక శ్రేణులకు అంతర్గతంగా సూచనలు చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఆసక్తికరంగా పోరు..
ప్రస్తుతం తొలి విడత ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుండగా.. రెండో విడతలో నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగిసింది. బుధవారం స్కూట్నీ కార్యక్రమం జరగనుంది. దీంతో పాటు చివరిదశలో జరిగే జీపీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ఘట్టం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో అధికార పార్టీకి చెందిన సర్పంచ్ ఆశావాహులు పెద్ద సంఖ్యలో పోటీకి సై అంటే సై అంటుండడం ఆ పార్టీ ముఖ్య నేతలను బెంబేలెత్తిస్తోంది. స్వయంగా ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి బుజ్జగింపు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పలు ప్రాంతాల్లో ఇన్‌చార్జిలను నియమించి పరిస్థితి చక్కబెట్టేలా ముందుకు సాగుతున్నారు. అయినా ఉపసంహరణ సమయంలో రెబల్ అభ్యర్థులు తప్పించుకుని తిరుగుతుండడంతో వారికి ఏం చేయాలో తోచడం లేదని పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.
అజ్ఞాతంలోకి పలువురు పోటీదారులు
బరిలోనుంచి తప్పుకోవాలనే ఒత్తిళ్లు తప్పవని అండర్ గ్రౌండ్‌లోకి..
తొలివిడత నామినేషన్ల ఉపసంహరణకు నేడే తుది గడువు
తల పట్టుకుంటున్న ముఖ్య నేతలు
ఆసక్తికరంగా పల్లె పోరు


