సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త: ఎస్పీ
నారాయణపేట: సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ డా.వినీత్ సూచించారు. సైబర్ భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన ‘ఫ్రాడ్ కో ఫుల్ స్టాప్’ పోస్టర్‌ను మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్రంలో సైబర్ నేరాలను నియంత్రించడం, ప్రజల్లో సైబర్ భద్రతపై అవగాహన పెంపు కోసం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ‘ఫ్రాడ్ కో ఫుల్ స్టాప్’ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. సైబర్ నేరాలు రోజురోజుకు కొత్త పంథాలో జరుగుతున్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్యాంక్, పోలీస్, ప్రభుత్వ శాఖల పేరుతో వచ్చే స్కామ్ కాల్స్‌కు స్పందించొద్దన్నారు. ఎవరూ ఓటీపీ, పిన్ నంబర్, బ్యాంక్ వివరాలు అడగరని.. ఇలాంటి వాటిని అడిగితే వెంటనే 1930 నంబర్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ సైబర్ భద్రతా నియమాలు పాటించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ నల్లపు లింగయ్య, మహేశ్, ఐటీ కోర్ ఎస్‌ఐ సురేశ్ పాల్గొన్నారు.


