పడమటి అంజన్నఉత్సవాలకు అంకురార్పణ
మక్తల్: పట్టణంలో శ్రీపడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా ఉత్తరాది మఠం నుంచి స్వామివారి ఉత్సవ మూర్తిని పల్లకీలో ఆంజనేయస్వామి ఆలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చి.. ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణల మధ్య ధ్వజారోహణం, అలంకారోత్సవం నిర్వహించారు. పడమటి అంజన్న బ్రహ్మోత్సవాలతో పట్టణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రాణేశ్ ఆచారి, ఈఓ కవిత తదితరులు పాల్గొన్నారు.
ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన కాంగ్రెస్
మక్తల్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్.రాజేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మక్తల్‌లోని చిట్టెం నివాసంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. మక్తల్ – నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం డిజైన్ ఆరు నెలలకోసారి మారుస్తున్నారని.. ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి తెర లేపుతున్నారని ఆరోపించారు. సంగంబండ బ్యాక్‌వాటర్ నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తరలించే అవకాశం ఉన్నా.. ప్రాజెక్టు అంచనాలు పెంచేలా డిజైన్ మార్చారన్నారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు గురై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారన్నారు. జిల్లాలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సంగతి ఏమో కానీ.. మక్తల్‌లో ఉన్న ఆరు గురుకులాలకు పక్కా భవనాలు నిర్మించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు చిట్టెం సుచరిత, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నర్సింహాగౌడ్, శ్రీనివాస్ గుప్త, చిన్న హన్మంతు, అన్వర్ పాల్గొన్నారు.
నేడు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం
నారాయణపేట: జిల్లా కేంద్రంలోని నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రంలో బుధవారం మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశా ఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించనున్నట్లు అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని దివ్యాంగులు, స్వచ్ఛంద సంస్థలు, దివ్యాంగ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
పడమటి అంజన్నఉత్సవాలకు అంకురార్పణ


