రెండో విడత ముగిసిన నామినేషన్ల పర్వం
● అర్ధరాత్రి వరకు కొనసాగిన స్వీకరణ
● సర్పంచ్‌కు 609, వార్డు స్థానాలకు 2,063
నారాయణపేట: జిల్లాలోని నారాయణపేట నియోజకవర్గంలో రెండో విడత ఎన్నికలు జరుగుతున్న పంచాయతీలకు నామినేషన్ల పర్వం మంగళవారం ముగిసింది. చివరి రోజు సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు భారీగా తరలిరావడంతో ఆర్ధరాత్రి వరకు స్వీకరణ కొనసాగింది. దామరగిద్ద, ధన్వాడ, మరికల్, నారాయణపేట మండలాల్లో మొత్తం 95 సర్పంచ్ స్థానాలకు గాను 348 మంది, 900 వార్డు స్థానాలకు 1,550 మంది నామినేషన్లు వేశారు. మొత్తం ఆయా గ్రామపంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు 609, వార్డులకు 2,063 నామినేషన్లు వచ్చాయి. రాత్రి 11 గంటల వరకు దామరగిద్ద మండలంలోని లోకుర్తి క్లస్టర్, ధన్వాడ మండలంలోని చర్లపల్లి క్లస్టర్‌లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. ఇంకా నామినేషన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఎక్కడ ఎన్ని నామినేషన్లు అందాయో జిల్లా పంచాయతీ అధికారికి సమాచారం సరిగ్గా అందకపోవడం గమనార్హం. అయితే సమాచారం నిమిత్తం డీపీఆర్వోకు ఫోన్ చేయగా 11:23 నిమిషాలకు జిల్లాలోని నామినేషన్ల వివరాలను డీపీఆర్‌ఓ గ్రూప్‌లో పోస్టు చేశారు. దీన్ని బట్టి ఎన్నికల నిర్వహణలో అధికారుల పనితీరు ఏవిధంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది.
రెండో విడత ముగిసిన నామినేషన్ల పర్వం


