చెక్కులు ఇస్తామని.. చేయిచ్చారు!
నారాయణపేట: మక్తల్ – నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితులకు నిరాశే మిగిలింది. రైతుల విజ్ఞప్తి మేరకు ఎకరానికి రూ. 20లక్షల చొప్పున పెంచిన నష్టపరిహారం చెక్కులను అందిస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు భూ నిర్వాసితులను మక్తల్‌లో సోమవారం జరిగిన సీఎం సభకు తరలించారు. అయితే సభ ముగిసినా భూ నిర్వాసితులకు చెక్కుల మాట ఎత్తకపోవడంతో నిరాశకు గురయ్యారు. తమ భూములను స్వచ్ఛందంగా ప్రాజెక్టు కోసం రాసిస్తే.. ప్రభుత్వం న్యాయమైన పరిహారం అందించేందుకు రోజులు గడుపుతోందని వాపోతున్నారు. సీఎం సభలో చెక్కులు ఇస్తామని చెప్పి చెయ్యిచ్చారంటూ భూ నిర్వాసితులు బహిరంగంగా విమర్శించడం చర్చనీయాంశంగా మారింది.
ఎన్నికల కోడ్ నేపథ్యంలో..
సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా మక్తల్, ఆత్మకూర్ పట్టణాల్లో రూ.వెయ్యి కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసేందుకు లేని ఎన్నికల కోడ్.. మక్తల్–పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం చెక్కుల పంపిణీకి అడ్డొచ్చిందా అంటూ ప్రశ్నిస్తున్నారు. గతేడాదే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని.. ఇప్పటికే పలువురు రైతులకు ఎకరా రూ. 14లక్షల చొప్పున పరిహారం అందించారని గుర్తు చేస్తున్నారు. రైతుల విజ్ఞప్తి మేరకు ఎకరాకు పెంచిన రూ. 20లక్షల నష్టపరిహారం ఇచ్చేందుకు ఎన్నికల కోడ్‌ను సాకుగా చెబుతున్నారని ఆవేదన చెందుతున్నారు.
మంత్రి
ఇద్దామన్నా..
భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇప్పించేందుకు మంత్రి వాకిటి శ్రీహరితో పాటు స్థానిక ఎమ్మెల్యే డా.చిట్టెం పర్ణికారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి ప్రత్యేక చొరవతో అధికారులతో నివేదికలను తయారు చేయించారు. సీఎం చేతుల మీదుగా చెక్కులను అందజేయాలని అనుకున్నారు. మంత్రి వాకిటి శ్రీహరి ఒక అడుగు ముందుకేసి.. భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెక్కులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్‌కు సూచించారు. కానీ గ్రామపంచాయతీ ఎన్నికల కోడ్ ఉండటంతో అధికారికంగా రైతులకు నష్టపరిహారం అందించలేమని కలెక్టర్ మంత్రికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
సీఎం సభలో నష్టపరిహారం చెక్కుల కోసం భూ నిర్వాసితుల నిరీక్షణ
చివరకు చెక్కుల పంపిణీ మాటెత్తని అధికారులు, పాలకులు
ఆశతో వచ్చి.. నిరాశతో వెనుదిరిగిన వైనం
‘మక్తల్–పేట–కొడంగల్’ భూ నిర్వాసితులకు చేదు అనుభవం
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు..
ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులు ఎకరాకు రూ. 20లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తే తమ భూములను స్వచ్ఛందంగా ఇస్తామని రాసిచ్చారు. అయితే గ్రామపంచాయతీ ఎన్నికల కోడ్ ఉండటంతో పరిహారం చెక్కులను పంపిణీ చేయలేకపోయాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎన్నికల తర్వాత నష్టపరిహారం అందే అవకాశం ఉంది. – రామచందర్ నాయక్, ఆర్డీఓ, నారాయణపేట
చెక్కులు ఇస్తామని.. చేయిచ్చారు!


