నేడు కలెక్టరేట్‌లో ప్రజా వినతుల స్వీకరణ
నంద్యాల: స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో డిసెంబర్ 1వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’కార్యక్రమా న్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov. in వెబ్‌సైట్‌ను సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 9.30 గంటలకు అధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు.
మద్దిలేటి స్వామి క్షేత్రంలో వాట్సాప్ సేవలు
బేతంచెర్ల: జిల్లాలోని ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహ స్వామి ఆలయంలో భక్తులకు వాట్సాప్ ద్వారా సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు ఉప కమిషనర్ రామాంజనేయులు తెలిపారు. వాట్సాప్ ద్వారా భక్తులకు దర్శనం, ప్రసాదం, రూముల బుకింగ్ సేవలను పొందవచ్చన్నారు. ఈ సేవలను వినియోగించుకోవడానికి భక్తులు 9552300009 సంప్రదించాలని సూచించారు.
నేడు ఎన్‌టీఆర్ భరోసా
పింఛన్లు పంపిణీ
నంద్యాల(న్యూటౌన్): జిల్లాలో ఎన్‌టీఆర్ భరోసా పింఛన్లు సోమవారం నుంచి పంపిణీ చేస్తున్నట్లు డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో 2,14,496 మంది పింఛన్‌దారులకు రూ.92.47 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. సచివాలయ సిబ్బంది, వీఆర్‌ఓలు, పంచాయతీ కార్యదర్శులు సోవారం ఉదయం నుంచి పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. 100 శాతం పంపిణీ పూర్తి చేయాలన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాగులతో పాటు అంగవైకల్యం ఉన్న వారు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పింఛన్లు పంపిణీ చేయాలన్నారు. పింఛన్ల పంపిణీలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు.
అరకొర ఆర్టీసీ బస్సులు
పాణ్యం: ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. బస్టాండ్‌ల వద్ద ప్రజలు గంటల తరబడి వేచి ఉన్నా బస్సులు రావడం లేదు. పాణ్యం ఆర్టీసీ బస్టాండ్‌లో ఆదివారం ప్రయాణికులు రద్దీ కనిపించింది. ఆర్టీనరీ, ఎక్స్‌ప్రెస్‌లు వచ్చినా కాలు పెట్టేందుకు వీలు లేనంతగా నిండిపోయి ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని ఆర్టీసీ బస్సులు నడపాలని ప్రజలు కోరారు.
కర్నూలు(అగ్రికల్చర్): తిరుపతిలోని ఏపీఎస్‌పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో డిసెంబరు 1వ తేదీన డయల్ యువర్ ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ తెలిపారు. వినియోగదారు లు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను ఫోన్ ద్వారా తమ దృష్టికి తెస్తే వెంటనే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, వైఎస్‌ఆర్ కడప, అన్నమయ్య, కర్నూ లు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల వినియోగదారులు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు 89777 16661కు ఫోన్ చేసి సమస్యల గురించి చెప్పవచ్చని తెలిపారు.
అప్రమత్తంగా ఉండండి...
దిత్వా తుఫాన్ ప్రభావం వల్ల ఏపీఎస్‌పీడీసీఎల్ పరిధిలోని 9 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందున విద్యుత్ అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సీఎండీ శివవంకర్ ఆదేశించారు. వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం జరిగితే వెంటనే పునరుద్ధరించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
నేడు కలెక్టరేట్‌లో ప్రజా వినతుల స్వీకరణ


