14 నెలలకే.. నూరేళ్లు!
● ట్రాక్టర్ కింద పడి చిన్నారి దుర్మరణం
పగిడ్యాల: బుడి బుడి అడుగుల చప్పుళ్లు ఆగిపోయాయి.. బోసి నవ్వులు మాయమయ్యాయి. నాలుగు నెలల క్రితం జరిగిన మొదటి పుట్టిన రోజు వేడుకల సందడిని కుటుంబీకులు ఇంకా మరువక ముందే విధి ఆ చిన్నారిని వారికి దూరం చేసింది. ఊహించని ఘటన ఆ ఇంటి దీపాన్ని ఆర్పేసింది. అప్పటి వరకు కుటుంబీకుల మధ్య ఆడుకుంటున్న చిన్నారిని క్షణాల్లో మృత్యువు ట్రాక్టర్ రూపంలో కబళించింది. నెహ్రూనగర్‌లో ఆదివారం ఈ విషాదం చోటు చేసుకుంది. 14 నెలల వయస్సున్న బాలుడు ట్రాక్టర్ కింద పడి దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన గొడుగు శంకరయ్య, లావణ్యకు రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరి కుమారుడు గొడుగు చేతన్ (14 నెలలు) ఉన్నాడు. నాలుగు నెలల క్రితమే మొదటి పుట్టిన రోజు వేడుకలను బంధువుల మధ్య ఆర్భాటంగా నిర్వహించారు. శంకరయ్య ఇంటి సమీపంలోనే గొడుగు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి గృహ నిర్మాణం చేపట్టాడు. సిమెంట్ ఇటుకలను ఆదివారం ఉదయం కర్నూలు నుంచి ట్రాక్టర్‌లో తెప్పించాడు. అన్‌లోడ్ అనంతరం ట్రాక్టర్.. శంకరయ్య ఇంటి మీదుగా వెళ్తుండగా ఇంట్లో నుంచి చిన్నారి చేతన్ హఠాత్తుగా రోడ్డుపైకి పరుగెడుతూ వచ్చి ట్రాక్టర్ ట్రాలీ టైరు కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో బాలుడి తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ముచ్చుమర్రి ఎస్‌ఐ నరేంద్ర సిబ్బందితో నెహ్రూనగర్ చేరు కుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. మృతి చెందిన బాలుడి తల్లి లావణ్య ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్ మహబూబ్ బాషాపై కేసు నమోదు చేశారు. ‘14 నెలలకే నూరేళ్లు నిండాయా.. నాయనా’.. అంటూ కుమారుడి మృతదేహం వద్ద తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు బంధువులు, గ్రామస్తులను కంటతడి పెట్టించింది. పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు.
14 నెలలకే.. నూరేళ్లు!


