దిత్వా తరుముకొస్తోంది!
మొక్కజొన్న దిగుబడులపై పట్టలు కప్పిన దృశ్యం
కోవెలకుంట్ల సమీపంలో కోత దశలో ఉన్న వరి
కోవెలకుంట్ల: దిత్వా తుపాన్ అన్నదాత గుండెల్లో గుబులు రేపుతోంది. అక్టోబర్ నెలాఖరులో మోంథా తుపాన్‌తో వాటిల్లిన నష్టం నుంచి ఇంకా తేరుకోక ముందే మరో తుపాన్ ముంచుకు రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తుపాన్ ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఉదయం మోస్తరు వర్షం కురిసింది. మరో మూడు రోజులపాటు వర్షాలు కురిసే ఆస్కారం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించడంతో రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన వివిధ పంటలు కోత, నూర్పి డి, పూత, పిందె దశల్లో ఉండగా తుపాన్ రైతులను భయపెడుతోంది. జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో 73,038 హెక్టార్లలో కర్నూలు, నంద్యాల సోనా రకాలకు చెందిన వరి, 27,540 హెక్టార్లలో కంది, 55,408 హెక్టార్లలో మొక్కజొన్న, 5,419 హెక్టార్లలో పత్తి పంటలు సాగయ్యాయి. వరి పంట లో రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందు లు, కలుపు, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 35 వేల వరకు పెట్టుబడులు వెచ్చించారు. జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో పైరు కోత, నూర్పిడి దశలో ఉంది. అలాగే మొక్కజొన్న దిగుబడులను కల్లాలు, పొలాలు, రోడ్లపై ఆరబోసుకున్నారు. ఈ ఏడాది విస్తారంగా సాగైన కంది పంట ప్రస్తుతం పూత దశలో ఉంది. ఆయా పంటల్లో పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 20 వేలకు పైగా వెచ్చించారు. సీడు, హైబ్రిడ్ పత్తి పంటలు వివిధ దశల్లో ఉండగా రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కూలీల రూపంలో ఎకరాకు రూ. 50 వేల నుంచి రూ. 75 వేల వరకు ఖర్చు చేశారు. ఇలాంటి తరుణంలో తుపాన్ కారణంగా మోస్తరు వర్షం కురియడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. కోత, నూర్పిడి చేసిన దిగుబడులు తడవకుండా పట్టలు కప్పుకున్నారు. భారీ వర్షాలు కురిస్తే ఆయా పంటలు దెబ్బతిని తీవ్రనష్టం వాటిల్లుతుందని ఆందోళన చెందుతున్నారు.
తుపాన్ ప్రభావంతో పలు ప్రాంతాల్లో
మోస్తరు వర్షం
కోత, నూర్పిడి దశలో వరి
పూత, పిందె దశల్లో
కంది, పత్తి పంటలు
ఆందోళనలో అన్నదాతలు
దిత్వా తరుముకొస్తోంది!


