మిర్యాలగూడ అర్బన్: తీవ్ర జ్వరం, ఆయాసంతో బాధపడుతూ చికిత్స నిమిత్తం శుక్రవారం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి వచ్చిన మహిళ మృతి చెందింది. మిర్యాలగూడ మండలంలోని ముల్కలకాల్వ గ్రామానికి చెందిన నాగిళ్ల వెంకటమ్మ(35) తీవ్ర జ్వరం, ఆయాసంతో బాధపడుతుండగా చికిత్స నిమిత్తం ఆమె కుమారుడు శుక్రవారం ఉదయం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చాడు. ఓపీ నమోదు చేయించుకుని ఆస్పత్రిలో చేర్పించుకున్నారు. అయితే ఆయాసం ఎక్కువ కావడంతో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారి మృతి చెందింది. సకాలంలో వైద్య సేవలు అందించకపోవడంతోనే మృతిచెందిందని కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. సుమారు రెండు గంటల పాటు వైద్యం అందించలేదని పేర్కొన్నారు. సకాలంలో ఆక్సిజన్ అందించి వైద్యం చేస్తే మా అమ్మ బతికేదని కుమారుడు ఆవేదన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న సీపీఐ డివిజన్ అధ్యక్షుడు బంటు వెంకటేశ్వర్లు ఆస్పత్రికి చేరుకుని మృతురాలి కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యం అందించడంతో నిర్లక్ష్యం వహించిన వైద్యులను తక్షణమే సస్పండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏరియా ఆస్పత్రి ఎదుట రోగి బంధువులతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి సంఘనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను వివరణ కోరగా రోగి ఆస్పత్రికి వచ్చే సమయానికి ఆమె పరిస్థితి విషమంగా ఉందని, ఆమెను పరీక్షించి వైద్యం అందించే లోపే మృతి చెందిందని తెలిపారు.
ఫ వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన
ఆయాసంతో బాధపడుతూ ఆస్పత్రిలో మహిళ మృతి


