రైతుల గోస పట్టని పాలకులకు బుద్ధి చెప్పాలి
మిర్యాలగూడ : వర్షాలతో పంట నష్టపోయి ఆందోళనలో ఉన్న రైతుల గోస పట్టకుండా ఎన్నిక ప్రచారం చేస్తున్న పాలకులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. మోంథా తుపాన్ కారణంగా రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని, నల్లగొండ జిల్లాలో సుమారు లక్ష ఎకరాలకు పైగా పంట నీటిపాలు అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. చేతికొచ్చిన పంట నాశనం కావడంతో అన్నదాతలు ఆందోళనలో ఉన్నారని, ఈ పరిస్థితుల్లో రైతులను ఓదార్చి అండగా నిలవాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొనడం సరైంది కాదన్నారు. పంట నష్టం వివరాలను సేకరించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఐకేపీ కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. లేనపక్షంలో రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వీరేపల్లి వెంకటేశ్వర్లు, నాయకులు రాగిరెడ్డి మంగారెడ్డి, చౌగాని సీతారాములు, మల్లు గౌతంరెడ్డి, బావండ్ల పాండు, వినోద్‌నాయక్, పోలెబోయిన వరలక్ష్మి, పాల్వాయి రాంరెడ్డి, గోవింద్‌రెడ్డి, వీరారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, అరుణ, దయానంద్, కోటిరెడ్డి, వెంకన్న, కృష్ణయ్య, రామకృష్ణ, సూర్యం, లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి


