
సాగర్ నుంచి పాలేరుకు నీటి విడుదల
నాగార్జునసాగర్: ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్‌లో నీటి నిల్వ తగ్గినందున తాగునీటికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి పాలేరుకు మూడు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. దీంతో శుక్రవారం మధ్యాహ్నం సాగునీటి శాఖ అధికారులు ఎడమ కాల్వ ద్వారా పాలేరుకు నీటిని విడుదల చేశారు. మొదట వెయ్యి క్యూసెక్కులు విడుదల చేశారు. క్రమంగా పెంచుతూ మూడు వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయనున్నట్లుగా సాగర్ డ్యాం ఎస్‌ఈ మల్లికార్జున్ తెలిపారు.
సాగర్ జలాశయంలో నీటి నిల్వలు ఇలా..
సాగర్ జలాశయం గరిష్ట నీటిమట్టం 590 అడుగులు(312.0450టీఎంసీలు)కాగా.. ప్రస్తుతం 522.20 అడుగుల(153.3180 టీఎంసీలు) నీరు ఉంది. ఎగువన శ్రీశైలం జలాశయం నుంచి విద్యుదుత్పాదన ద్వారా 54,051 క్యూసెక్కుల నీరు సాగర్‌కు వచ్చి చేరుతోంది.