
శ్మశానంలోనే ఆమె బతుకు బండి
మిర్యాలగూడ టౌన్: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఎర్రకుంట గ్రామానికి చెందిన పత్తిపాటి ప్రకాశం, మణెమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. వారికి కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు. ఊళ్లో కూలీ పనులు దొరక్కపోవడంతో 26 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం మిర్యాలగూడ పట్టణానికి వలస వచ్చారు. తమకు తెలిసిన వారి ద్వారా మిర్యాలగూడ పట్టణంలోని హిందూ శ్మశానవాటికలో కూలీ పనికి కుదిరారు. ఇక్కడే కాటికాపరిగా స్థిరపడ్డారు. ఆ తర్వాత ఐదేళ్లకు అనారోగ్యంతో ప్రకాశం మృతిచెందాడు. అప్పటి నుంచి మణెమ్మనే కాటికాపరిగా పనిచేస్తోంది. తాము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు చిల్లంచర్ల అనంతరాములే తమ కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచారని, తన భర్త బతికి ఉన్నప్పి నుంచి కూడా అనంతరాములే తమకు జీతం ఇస్తున్నారని మణెమ్మ పేర్కొంది. మొదట్లో ప్రతినెల రూ.600 వరకు జీతం ఇచ్చేవారని, ఇప్పుడు రూ.1000 ఇస్తున్నారని తెలిపింది. తనకు కిడ్నీలో రాళ్లు వస్తే ఆపరేషన్ ఖర్చు కూడా ఆయనే భరించారని పేర్కొంది.
వితంతు పింఛనే ఆధారం..
కరోనా సమయంలో ఎవరు కూడా మృతదేహాలను కాల్చేందుకు ముందుకు రాకపోవడంతో మణెమ్మనే దగ్గరుండి దహన సంస్కారాలు నిర్వహించింది. ఇప్పటికీ ఆమెకు సొంతిళ్లు కూడా లేదు. వితంతు పింఛన్ డబ్బులే కొంత మేరకు ఆమెకు ఆధారం. ఇంటి స్థలం మంజూరు చేయాలని ప్రజా ప్రతినిధులు, అధికారులను మణెమ్మ కోరుతోంది. శ్మశానవాటికలో పనిచేస్తూనే తన ఇద్దరు కుమారులు, కుమర్తెకు వివాహాలు చేసింది. మణెమ్మకు ఔట్‌సోర్సింగ్ కింద పారిశుద్ధ్య కార్మికులకు ఏవిధంగా వేతనాలు ఇస్తున్నారో అదే రీతిలో వేతనం ఇస్తే బాగుండేదని స్థానికులు అంటున్నారు.
చీకటి పడిందంటే సాధారణంగా బయటకు వెళ్లేందుకు మహిళలు భయపడతారు. కానీ ఈ మహిళ రాత్రి, పగలు అనే తేడాలేకుండా శ్మశానంలోనే చితిమంటల మధ్య జీవనం సాగిస్తోంది. భర్త మృతి అనంతరం అతడి దారిలోనే కాటికాపరిగా పనిచేస్తూ బతుకు బండిని లాగుతోంది.
మొదట్లో చాలా భయమేసింది
మొదట్లో శవాన్ని దహనం చేస్తుంటే చాలా భయమేసేది. కానీ తర్వాత అలవాటుగా మారిపోయింది. నేను శవాలను దహనం చేయడం ఒక సేవగా భావిస్తున్నాను. నా పిల్లలందరికీ వివాహాలు అయ్యాయి. పెద్ద కుమారుడు తాపీ మేసీ్త్రగా, చిన్న కుమారుడు కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కోడళ్లు కూడా నాకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ప్రభుత్వం కనీసం ఇంంటి స్థలం అయినా ఇచ్చి ఆదుకోవాలి. మున్సిపాలిటీ కార్మికులకు వచ్చే విధంగా వేతనమైనా ఇస్తే బాగుంటుంది.
– పత్తిపాటి మణెమ్మ
ఫ భర్త మృతి అనంతరం
కాటికాపరిగా పనిచేస్తున్న మహిళ

శ్మశానంలోనే ఆమె బతుకు బండి

శ్మశానంలోనే ఆమె బతుకు బండి