
అందరు ఉన్నా అనాథ శవంగా..
భువనగిరిటౌన్: భువనగిరి పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి అందరు ఉన్నా అనాథయ్యాడు. వివరాలు.. భువనగిరి పట్టణంలోని రెడ్డివాడకు చెందిన పట్నం పవన్ (40) గత నెల 21న భార్య కల్పన, ఇద్దరు కుమార్తెలతో కలిసి జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం చాగల్ గ్రామంలోని తన అత్తగారింటికి బస్సులో బయల్దేరాడు. మార్గమధ్యలో జనగామలో పవన్ బస్సు దిగి.. తనకు పని ఉంది, చూసుకొని వస్తాను అని భార్యకు చెప్పాడు. కల్పన ఇద్దరు కుమార్తెలతో కలిసి పుట్టింటికి వెళ్లింది. రెండు రోజులు గడిచినా భర్త ఇంటికి రాకపోవడంతో కల్పన భువనగిరిలోని పవన్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. ఎంత వెతికినా పవన్ ఆచూకీ లభించకపోవడంతో ఐదు రోజుల అనంతరం జనగామ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కానీ అప్పటికే జనగామ మండలం యశ్వంతపూర్ వద్ద పవన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. జనగామ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో నాలుగు రోజులపాటు గుర్తుతెలియని మృతదేహంగా పోలీసులు భద్రపరిచి అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ క్రమంలో కల్పన భర్త ఆచూకీ కోసం శుక్రవారం జనగామ పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా.. గుర్తుతెలియని మృతదేహంగా పేర్కొని అంత్యక్రియలు నిర్వహించిన ఫొటోలు చూపించగా.. తన భర్త పవన్ మృతదేహామే అని ఆమె నిర్ధారించింది. అయితే కల్పన ఫిర్యాదు వెంట పవన్ ఫొటోను జతచేయకపోవడంతో మృతదేహం గుర్తింపులో ఆలస్యం జరిగిందని జనగామ పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు పవన్ కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు శనివారం జనగామలో పవన్ మృతదేహాన్ని ఖననం చేసిన ప్రదేశాన్ని సందర్శించి నివాళులర్పించారు.
ఫ జనగామ జిల్లాలో జరిగిన రోడ్డు
ప్రమాదంలో మృతిచెందిన భువనగిరి వాసి
ఫ 13రోజుల తర్వాత కుటుంబ
సభ్యులకు అందిన సమాచారం
ఫ అప్పటికే గుర్తుతెలియని మృతదేహంగా గుర్తించి అంత్యక్రియలు నిర్వహించిన జనగామ పోలీసులు