ఎనిమిది నెలల కుమార్తెతో సహా మహిళ ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఎనిమిది నెలల కుమార్తెతో సహా మహిళ ఆత్మహత్య

Jul 6 2025 7:01 AM | Updated on Jul 6 2025 7:01 AM

ఎనిమిది నెలల కుమార్తెతో సహా మహిళ ఆత్మహత్య

ఎనిమిది నెలల కుమార్తెతో సహా మహిళ ఆత్మహత్య

శాలిగౌరారం: మానసికస్థితి సరిగా లేని మహిళ తన ఎనిమిది నెలల కుమార్తెతో కలిసి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామంలో శనివారం జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వంగమర్తి గ్రామానికి చెందిన సాయిని శంకరయ్య, వీరమ్మ దంపతుల కుమార్తె వాణి(23)ని యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఎన్నారం గ్రామానికి చెందిన సింగారపు మహేశ్‌కి నాలుగేళ్ల క్రితం వివాహం జరిపించారు. మహేశ్‌, వాణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు సంతానం. పెద్ద కుమార్తె పుట్టిన సమయంలోనే వాణి మానసిక స్థితి దెబ్బతినడంతో అనారోగ్యానికి గురైంది. దీంతో వాణిని ఆమె తల్లిదండ్రులు వైద్యం కోసం ఆస్పత్రుల్లో చూపిస్తున్నారు. ఈ క్రమంలో వాణి తరచూ తన తల్లిగారింటికి వచ్చి వెళ్తుండేది. నెల రోజుల క్రితం పెద్ద కుమార్తెను భర్త వద్ద ఉంచి చిన్న కుమార్తె హర్షిత(8 నెలలు)తో కలిసి వాణి వంగమర్తిలోని తల్లిగారింటికి వచ్చి ఉంటుంది.

అంగన్‌వాడీ కేంద్రానికి బయల్దేరి..

శనివారం వాణి తన చిన్న కుమార్తె హర్షితతో కలిసి ఇంటి వద్ద ఉండగా ఆమె తల్లిదండ్రులు పొలం వద్దకు వెళ్లారు. వాణి తన కుమార్తెను తీసుకొని మధ్యాహ్నం సమయంలో అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లొస్తానని చుట్టుపక్కల వారికి చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. కానీ వాణి అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లకుండా వంగమర్తి గ్రామ సమీపంలోని 365వ నంబర్‌ జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్లి హైవే పక్కన ఉన్న నిరుపయోగంగా ఉన్న వ్యవసాయ బావిలో కుమార్తెతో పాటు దూకింది. మధ్యాహ్నం తర్వాత ఇంటికి వచ్చిన వాణి తల్లిదండ్రులు కుమార్తె ఇంట్లో కనిపించకపోయేసరికి చుట్టుపక్కల వారిని అడిగారు. దీంతో వారు అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్తున్నానని చెప్పిందని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లి అడుగగా అక్కడకు రాలేదని అంగన్‌వాడీ సిబ్బంది తెలిపారు. ఆందోళనకు గురైన వాణి తల్లిదండ్రులు ఎన్నారం గ్రామానికి ఫోన్‌ చేసి వాణి వచ్చిందేమోనని ఆరా తీశారు. కానీ అక్కడకు కూడా వాణి రాలేదని చెప్పడంతో గ్రామంలో ఆరా తీయగా.. రెండు గంటల ముందు కుమార్తెతో కలిసి వాణి జాతీయ రహదారి వెంట మాధారంకలాన్‌ వైపు నడుచుకుంటూ వెళ్లిందని గ్రామస్తులు తెలిపారు. వాణి తల్లిదండ్రులతో పాటు స్థానికులు జాతీయ రహదారి వెంట గాలిస్తూ.. నిరుపయోగంగా ఉన్న వ్యవసాయ బావిలో చూడగా అప్పటికే వాణి మృతిచెంది నీటిలో తేలియాడుతూ కనిపించింది. వాణి మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ సైదులు ఘటనా స్థలానికి చేరుకుని నకిరేకల్‌లోని ఫైర్‌ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారి హర్షిత మృతదేహం కోసం తీవ్రంగా గాలించారు. అప్పటికే రాత్రి కావడంతో గాలింపు చేపట్టడం సాధ్యం కాకపోవడంతో నిలిపివేశారు. రాత్రి వరకు చిన్నారి హర్షిత మృతదేహం లభ్యంకాలేదు. మృతురాలి తండ్రి సాయిని శంకరయ్య ఇచ్చిన ఫిపిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని వాణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సైదులు వివరించారు.

ఫ మతిస్థిమితం సరిగా లేక వ్యవసాయ బావిలో దూకి బలవన్మరణం

ఫ తల్లి మృతదేహం లభ్యం

ఫ నల్లగొండ జిల్లా శాలిగౌరారం

మండలం వంగమర్తి గ్రామంలో ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement