
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్
ఫ 11 కిలోల గంజాయి స్వాధీనం
సూర్యాపేటటౌన్: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను కోదాడ రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు వివరాలను శనివారం సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ తన కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ మండలం దొరకుంట గ్రామానికి చెందిన అడప రాకేష్ పదిరోజుల క్రితం కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్‌లో అతడిపై నమోదైన గంజాయి కేసులో వాయిదాకు హాజరయ్యేందుకు సూర్యాపేట జిల్లా కోర్టుకు వచ్చాడు. అక్కడ అతడికి గంజాయి కేసులోనే వాయిదా గురించి వచ్చిన ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వ్యక్తి పరిచయమయ్యాడు. అతడు కూడా గంజాయి కేసు వాయిదా గురించి వచ్చాడని తెలుసుకున్న రాకేష్ తనకు గంజాయి కావాలని అడిగగా.. జూన్ 29న ఒరిస్సా రాష్ట్రంలోని కల్‌మెల్లలోని శివమందిర్ గుడి వద్దకు రావాలని చెప్పాడు. అతడు చెప్పినట్టుగానే జూన్ 28న రాకేష్ ఒరిస్సాకు వెళ్లి అతడిని కలిసి 11కిలోల గంజాయి రూ.11వేలకు కొనుగోలు చేశాడు. ఆ గంజాయిని దొరకుంట గ్రామానికి తీసుకొచ్చి గ్రామ శివారులో గల ఖాళీ స్థలంలో పొదల మధ్యన దాచిపెట్టాడు. ఆ గంజాయిని మరో వ్యక్తికి విక్రయించేందుకు గాను ఈ నెల 2న కోదాడ పట్టణంలోని శ్రీరంగాపురానికి చెందిన వనపర్తి సాయి అలియాస్ సాయికుమార్ ఫోన్ చేశాడు. ఈ నెల 4న సాయికుమార్ గంజాయి కొనుగోలు చేసేందుకు రాకేష్ వద్దకు రాగా నమ్మదగిన సమాచారం మేరకు కోదాడ రూరల్ పోలీసులు వారిద్దరిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 11 కేజీల గంజాయితో పాటు ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల వద్ద పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.2.80 లక్షలు ఉంటుందని ఎస్పీ నరసింహ తెలిపారు. అయితే రాకేష్‌పై 2023 సంవత్సరంలో గంజాయి కేసు నమోదయ్యిందని ఎస్పీ పేర్కొన్నారు. నిందితులను పట్టుకున్న సీఐ రజితారెడ్డి, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ శివకుమార్, కోదాడ రూరల్ ఎస్‌ఐ అనిల్‌రెడ్డి, సీసీఎస్ ఎస్‌ఐ హరిక్రిష్ణతో పాటు పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ విలేకరుల సమావేశంలో కోదాడ డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.