
సార్.. మినిస్ట్రీ ప్లీజ్!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మంత్రి పదవుల కోసం మళ్లీ వినతులు మొదలయ్యాయి. హైదరాబాద్‌కు వచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను పలువురు ఆశావహులు కలిసి విజ్ఞప్తులు చేశారు. దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్.. ఖర్గేను కలిసి తనకు అవకాశం కల్పించాలని కోరారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తనకు మంత్రి పదవి ఇవ్వాలని ఇప్పుడు ఖర్గేను కలిసి విన్నవించకపోయినా గతంలోనే పార్టీని, సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. ఈ నేపథ్యంలో మూడో విడత కేబినెట్ విస్తరణలో ఎవరికి మంత్రి పదవి దక్కుతుందోనన్న చర్చ సాగుతోంది. కేబినెట్‌లో ఇంకా మూడు మంత్రి పదవుల భర్తీకి అవకాశం ఉంది. దీంతో మూడోసారి మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందన్న చర్చ జరుగుతోంది. మంత్రి పదవి కోసం ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో మల్లిఖార్జున ఖర్గే హైదరాబాద్‌కు వచ్చారు. మంత్రి పదవి ఆశిస్తున్న నేతలందరికి ఖర్గేతో భేటీ అయ్యేందుకు అవకాశం ఇచ్చారు. ఆయన్ని కలిసేందుకు రావాలంటూ వారికి కాంగ్రెస్ పార్టీ నుంచి సమాచారం ఇచ్చారు. దీంతో పలువురు ఎమ్మెల్యేలు ఆయనతో భేటీ అయ్యారు. పార్టీకు తాము చేసిన సేవలు, ప్రతినిధులుగా తమకు ఉన్న అనుభవం, సామాజికంగా తమకు ఉన్న అనుకూల అంశాలను వివరించారు.
ఉమ్మడి జిల్లాలో
ఇద్దరు ఆశావాహులు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇద్దరు ఆశావహులు మంత్రి పదవి కోసం మొదటినుంచి అధిష్టానానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడే మొదటి విడతలోనే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మంత్రి పదవి ఆశించారు. అయితే, ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మంత్రివర్గంలో బెర్తు దక్కింది. లంబాడా కోటాలో బాలునాయక్ కూడా మంత్రి పదవి ఆశించినా ఆయనకు కూడా దక్కలేదు. ఇటీవల జరిగిన కేబినెట్ విస్తరణలోనూ వీరిద్దరికి బెర్త్ దక్కలేదు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో భేటీ అయిన దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్
ఫ మంత్రి పదవి కోసం ఖర్గేను కలిసి విజ్ఞప్తి చేసిన బాలునాయక్
ఫ ఇదివరకే మంత్రి పదవి కావాలని కోరిన రాజగోపాల్‌రెడ్డి
ఫ ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు ఆశావహులు
ఫ మూడో విడత విస్తరణలో అవకాశం దక్కేదెవరికో..
మూడో విడతలోనైనా..
త్వరలో మూడో విడత మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే చర్చ సాగుతోంది. రెండో విడత మంత్రి పదవులు దక్కని వారిని పీసీసీ అధ్యక్షుడితో పాటు మంత్రులు కూడా బుజ్జగించారు. మళ్లీ అవకాశం వస్తుందని చెప్పారు. మూడో విడతపై చర్చ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తలతో భేటీ అయ్యేందుకు వచ్చారు. అదే సందర్భంలో మంత్రి పదవులను ఆశించిన ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఆ భేటీలో చాలా మంది ఎమ్మెల్యేలు తమకు మూడో విడత మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించాలని విజ్ఞప్తులు చేశారు. అందులో నల్లగొండ జిల్లా నుంచి దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ కూడా ఖర్గేను కలిసి మంత్రి వర్గంలో అవకాశం కల్పించాలని కోరారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ప్రస్తుతం ఖర్గేతో సమావేశం కాకపోయినా, గతంలోనే అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో మూడో విడత విస్తరణలో ఎవరికి అవకాశం దక్కుతుందోనన్నది చర్చనీయాంశంగా మారింది.