
రూ. 6 కోట్ల పనులకు ఆమోదం
నల్లగొండ టూటౌన్ : నీలగిరి పట్టణంలో వివిధ అభివృద్ధి పనుల కోసం మున్సిపల్ అధికారులు రూ.15 కోట్లకు ప్రతిపాదనలు పంపగా రూ.6 కోట్ల పనులకు ఆమోదం లభించింది. త్వరలోనే రూ.6 కోట్లు నీలగిరి మున్సి పాలిటీకి మంజూరవుతాయని మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తెలి పారు. మిగతా రూ.9 కోట్ల కోసం మరోసారి ప్రతిపానదలు పంపినట్లు పేర్కొన్నారు.
యోగా సింధూర్ సభ పోస్టర్ ఆవిష్కరణ
నల్లగొండ టూటౌన్ : హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఈనెల 6వ తేదీన నిర్వహించే యోగా సింధూర్ విజయోత్సవ సభ పోస్టర్లను శుక్రవారం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య భారత్ ఆధ్వర్యంలో యోగా సింధూర్ సభ ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. కార్యక్రమంలో యోగా సింధూర్ అధ్యక్షుడు శివ దుర్గాప్రసాద్, ఎంవీ.గోనారెడ్డి, నారాయణ, శ్రీధర్, యోగా గురూజీ రాపోలు వెంకటేశ్వర్లు, ప్రవీణ్, భజరంగ్‌ప్రసాద్ పాల్గొన్నారు.
8 నుంచి పోస్టల్‌లో కొత్త సాఫ్ట్‌వేర్
రామగిరి(నల్లగొండ) : నల్లగొండ పోస్టల్ డివిజన్‌లోని నల్లగొండ, యదాద్రి భువనగిరి జిల్లాల్లో జూలై 8 నుంచి కొత్త సాఫ్ట్‌వేర్ అందుబాటులోకి రానున్నట్లు సూపరింటెండెంట్ కె.రఘునాథస్వామి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టు కింద నల్లగొండ డివిజన్‌లోని 2 హెడ్ ఆీఫీసులు, 37 సబ్ పోస్టాఫీస్‌లు, 392 పోస్టాఫీస్‌లు, 353 బ్రాంచ్ ఆఫీసుల్లో నూతనంగా ఐటీ 2.0 అప్లికేషన్ ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. జూలై 7 అన్ని పోస్టల్ కార్యాలయాల్లో ఎలాంటి లావాదేవీలు జరగవని తెలిపారు.
చెత్త రీసైక్లింగ్‌కు ‘రీకార్ట్’తో ఒప్పందం
నల్లగొండ టూటౌన్ : నీలగిరి మున్సిపాలిటీకి చెందిన శేషమ్మగూడెంలోని డంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్త కుప్పలను రీ సైక్లింగ్ చేసి శుభ్రం చేసేందుకు మున్సిపల్ అధికారులు హైదరాబాద్‌లోని రీకార్ట్ అనే సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. కొన్ని నెలల నుంచి డంపింగ్ యార్డును శుభ్రం చేయించేందుకు పలు సంస్థలతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడిన విషయం తెలిసిందే. దాంతో మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాద్ అహ్మద్ గురువారం హైదరాబాద్‌లో రీకార్ట్ సంస్థతో చేసుకోవాల్సిన ఒప్పంద పత్రాలను సిద్ధం చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పేపర్ వర్క్ పూర్తి చేయడంతో ఒప్పందం తుదిదశకు చేరుకుంది. ఒప్పంద పత్రాలపై సీడీఎంఏ శ్రీదేవి ఆమోద్ర వేయడమే మిగిలిపోయింది. ఆమె జపాన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ రాగానే ఒప్పందం అమల్లోకి రానుంది. డంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్తను భాగాలుగా విడదీసి మొత్తం రీ సైక్లింగ్ చేసి శుభ్రం చేయనున్నారు. ఇక నుంచి చెత్త కుప్పలుగా పేరుకుపోకుండా చర్యలు తీసుకోనున్నారు.
ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలి
హాలియా : ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం అన్నారు. టీఎస్ యూటీఎఫ్ సభ్యత్వ నమోదులో భాగంగా శుక్రవారం మండలంలోని అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులతో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని, కేజీబీవీలకు, ఉపాధ్యాయులకు మినిమం టైమ్ స్కేల్ ఇవ్వాలని, గురుకుల పాఠశాలల పనివేళలు మార్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చింతపల్లి రవీందర్, ఎస్‌కె సైయ్యద్ మీయా, జిల్లా కార్యదర్శి రమాదేవి, సరిత, వీరాసింగ్, మద్దెల ప్రసాద్, వెంకటేశ్వరరావు, సునీత, కోశాధికారి చంద్రయ్య ఉన్నారు.

రూ. 6 కోట్ల పనులకు ఆమోదం