సాక్షి, యాదాద్రి, బీబీనగర్ : కృషి, పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు జిల్లాకు చెందిన పలువురు న్యాయవాదులు. తాము ఎంచుకున్న మార్గంలో నిరంతర శ్రమతో రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానానికి చేరుకున్నారు. బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామానికి చెందిన వాకిటి రామకృష్ణారెడ్డిని హైకోర్టు జడ్జిగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. త్వరలో ఆయన హైకోర్టు న్యాయమూర్తిగా నియామకం కానున్నారు. ఇప్పటికే ఆలేరుకు చెందిన కలాసికం సృజన, రామన్నపేట మండలం బోగారం గ్రామానికి చెందిన కూనూరు లక్ష్మణ్‌గౌడ్ హైకోర్టు న్యాయమూర్తులుగా సేవలందిస్తున్నారు. అంతకుముందు వలిగొండ మండలం నెమలికాల్వ గ్రామానికి చెందిన వంగాల ఈశ్వర్యయ్యగౌడ్ హైకోర్టు జడ్జిగా పనిచేసి పదవీ విరమణ పొందారు.
రామకృష్ణారెడ్డి కుటుంబ నేపథ్యం,
న్యాయవాదిగా ప్రస్తానం
వాకిటి రామకృష్ణారెడ్డి 1970 సెప్టెంబర్ 14న జన్మించారు. బీబీనగర్ మండలం కొండమడుగు ఆయన స్వగ్రామం. వారిది వ్యవసాయ కుటుంబం. తండ్రి సర్పంచ్‌గా, జెడ్పీటీసీగా సేవలందించారు. తల్లి గృహిణి. అన్న, చెల్లి ఉన్నారు. 1998లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. ఆ తరువాత అనంతసేన్‌రెడ్డి అనే అడ్వకేట్ వద్ద జూనియర్‌గా పనిచేశారు. 2005 నుంచి సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభించారు. రంగారెడ్డి, సికింద్రాబాద్, సిటీ సివిల్ కోర్టులతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టుల్లో వాదనలు వినిపించారు. రామకృష్ణారెడ్డి గతంలో బీబీనగర్ మండలంలోని అక్కన్న మాదన్న ఆలయ భూముల కేసులో హైకోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపించడంతో అనుకూల తీర్పువచ్చింది. సివిల్, క్రిమినల్, రెవెన్యూ, కుటుంబ కేసులు వాదించడంలోనూ సమర్థులుగా పేరుంది. ఇప్పటి వరకు ఆయన వెయ్యి వరకు పిటిషన్లు దాఖలు చేశారు. 2016–17లో తొలి తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
విద్యభ్యాసం
రామకృష్ణారెడ్డి 1నుంచి 7వ తరగతి వరకు కొండమడుగు ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో చదివారు. 8నుంచి 10వ తరగతి వరకు బీబీనగర్‌లోని జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యనభ్యసించారు. ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లోని రెడ్డి కళాశాలలో పూర్తి చేశారు. న్యాయవాదిగా హైదరాబాద్‌లో ప్రాక్టీస్ చేశారు. రామకృష్ణారెడ్డిని హైకోర్టు జడ్జిగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేయడంతో జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఫ రామకృష్ణారెడ్డి పేరు సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం
ఫ యాదాద్రి జిల్లా నుంచి ఇప్పటికే హైకోర్టు జడ్జిలుగా సృజన, లక్ష్మణ్‌గౌడ్