
సదన్ హాసన్, విక్రమ్ జిత్, నరేశ్ రాజు, వినయ్ బాబు హీరోలుగా శ్రీలు దాసరి, అదితీ మైకేల్, మోహన సిద్ధి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రభుత్వ సారాయి దుకాణం’. నరసింహ నంది రచన, దర్శకత్వంలో దైవ నరేష్ గౌడ, పరిగి స్రవంతి మల్లిక్ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.
ఈ సినిమా టీజర్‌లోని డైలాగులు అసభ్యకరంగా, మహిళలను కించపరిచేలా ఉన్నాయంటూ పలువురు మహిళా సమాఖ్య ప్రతినిధులు మంగళవారం తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ప్రధాన కార్యదర్శి దామోదర ప్రసాద్‌కి వినతి పత్రం అందించారు.
ఈ సందర్భంగా మహిళా సమాఖ్య ప్రతినిధులు దీపా దేవి, నీరజ, ధనమ్మ మాట్లాడుతూ– ‘‘టీజర్‌లో మహిళలను కించపరుస్తూ డైలాగులు ఉన్నాయి. తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇలాంటి చిత్రాన్ని విడుదల కానివ్వం’’ అని తెలిపారు. వినతి పత్రం అందించిన వారిలో పద్మ, చంద్రమ్మ, నసీమా తదితరులు ఉన్నారు.