
ఇండస్ట్రీలో అప్పుడప్పుడు ఒకరు చేయాల్సిన సినిమాలు మరో హీరోకు వెళ్లడం పరిపాటే. రీసెంట్ టైంలోనూ అలాంటిదే జరిగింది. లెక్క ప్రకారం త్రివిక్రమ్-అల్లు అర్జున్ కలిసి ఓ ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది. కానీ కారణాలేంటో తెలీదు గానీ అది క్యాన్సిల్ అయింది. ప్రాజెక్టులోకి ఎన్టీఆర్ వచ్చి చేరాడు. సరే ఈ సంగతి పక్కనబెడితే తమిళ యంగ్ హీరో ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. తాను చేయాల్సిన ఓ మూవీలో బన్నీ నటించాడని చెప్పుకొచ్చాడు.
తెలుగు సినిమాల్లో తండ్రి క్యారెక్టర్స్ చేసే ప్రభు గుర్తున్నారుగా.. ఆయన కొడుకు విక్రమ్ ప్రభు తమిళంలో హీరోగా చాన్నాళ్ల నుంచి సినిమాలు చేస్తున్నాడు. 'గజరాజు'తో పాటు ఒకటి రెండు చిత్రాలు డబ్ చేసి రిలీజ్ అయ్యాయి. కానీ ఏమంత గుర్తింపు రాలేదు. ఇతడు తొలిసారి తెలుగులో చేసిన మూవీ 'ఘాటీ'. అనుష్క లీడ్ రోల్ చేసిన ఈ సినిమాలో.. ఆమె సరసన విక్రమ్ ప్రభు నటించాడు. సెప్టెంబరు 5న మూవీ థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ సాగుతున్నాయి.
(ఇదీ చదవండి: హీరోయిన్‌కి సూపర్ పవర్స్ ఉంటే.. 'కొత్త లోక' రివ్యూ)
తాజాగా ఓ తమిళ ఇంటర్వ్యూలో విక్రమ్ ప్రభు మాట్లాడుతూ.. దాదాపు పదేళ్ల క్రితం నాటి సంగతి బయటపెట్టాడు. 'అనుష్కతో గతంలోనే నేను సినిమా చేయాలి. 'రుద్రమదేవి'లో గోన గన్నారెడ్డి పాత్ర కోసం దర్శకుడు గుణశేఖర్ తొలుత నా దగ్గరికి వచ్చారు. మూడు నెలలు డేట్స్ కావాలని అడిగారు. కానీ నేను అప్పుడు వేరే చిత్రాలతో బిజీగా ఉండటంతో చేయలేకపోయాను. కానీ బన్నీ ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు' అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.
'రుద్రమదేవి'లో గోన గన్నారెడ్డిది అతిథి పాత్ర. కానీ అల్లు అర్జున్ చేయడంతో అప్పట్లో కాస్త క్రేజ్ వచ్చింది. మూవీ మోస్తరుగా ఆడినా సరే ఈ రోల్ బన్నీకి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. తెలంగాణ స్లాంగ్‌లో 'మీ అభిమానం సల్లగుండా' అంటూ చెప్పిన డైలాగ్స్ ఇప్పటికీ ఫేమస్. అల్లు అర్జున్ చేయడం వల్ల ఇంత క్రేజీ వచ్చింది. ఒకవేళ ఇదే పాత్ర విక్రమ్ ప్రభు చేసుంటే ఎలా ఉండేదో మరి?
(ఇదీ చదవండి: జాన్వీకి మరో డిజాస్టర్! ఇక ఆశలన్నీ 'పెద్ది' పైనే)
