
రజినీకాంత్ హీరోగా వచ్చిన లేటేస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కూలీ. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఆగస్టు 14న థియేర్లలో విడుదలైన కూలీ తొలి రోజే అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా రికార్డ్ సృష్టించింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.151 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. విజయ్ సినిమా లియో రికార్డ్ను కూలీ అధిగమించింది.
కూలీ మూవీ రిలీజైన వారం రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.222.5 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ బుధవారం అన్ని భాషల్లో కలిపి రూ.6.50 కోట్లు వసూలు చేసిందని సాక్నిల్క్ సైట్ వెల్లడించింది. ఈ మూవీ ఇండియాలో మొదటి రోజే రూ.65 కోట్ల నెట్ వసూలు చేసింది. అయితే రెండో రోజే రూ. 54.75 కోట్లు మాత్రమే రాబట్టింది. తొలివారంలో రూ.200 కోట్లకు పైగా నికర వసూళ్లు సాధించడంతో మేకర్స్ ఖుషీ అవుతున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ వసూళ్లు పరిశీలిస్తే రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్తో దూసుకెళ్తోంది. ఇదే జోరు కొనసాగితే రెండో వారంలో రూ.500 కోట్ల క్లబ్లో అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
కాగా.. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించి ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్లో నిర్మించారు. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్, అమీర్ ఖాన్ వంటి స్టార్స్ నటించారు. ఈ సినిమా హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ -2తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతోంది.