
రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కూలీ’. ఆగష్టు 14న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలైంది. కేవలం నాలుగు రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద రూ. 404 కోట్ల గ్రాస్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే, ఈ సినిమాకు సెన్సార్ నుంచి ‘ఏ’ సర్టిఫికెట్ వచ్చింది. దీంతో కలెక్షన్స్‌పై కాస్త ప్రభావం చూపుతుంది. ఈ అంశాన్ని గుర్తించిన నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తాజాగా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది.
భారత్‌లో 'కూలీ' సినిమాకి CBFC నుండి A సర్టిఫికేట్ పొందింది. అయితే, విదేశీ సెన్సార్ మాత్రం భిన్నమైన రిపోర్ట్‌ను జారీ చేసింది. ఒక్క కట్ కూడా సూచించకుండా ‘యూ/ఏ’ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. సుమారు మూడు దశాబ్దాల తర్వాత రజనీ సినిమాకి A సర్టిఫికేట్ లభించిడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇది మొత్తం కలెక్షన్లపై నిజంగానే ప్రభావం చూపింది. దేశవ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్స్‌లు పిల్లలను పరిమితం చేశాయి. అయితే, సినిమాలో ఊహించినంతగా హింస లేకపోవడంతో సెన్సార్ వివషయంలో ప్రేక్షకులు తప్పుబట్టారు. ఈ సినిమాకి A సర్టిఫికేట్ ఎందుకు వచ్చిందని చాలామంది ఆశ్చర్యపోయారు.
సెన్సార్ ఇచ్చిన ఈ సర్టిఫికేషన్‌ను సవాలు చేస్తూ సన్ పిక్చర్స్ ఇప్పుడు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. సెన్సార్ బోర్డు కూలీ సర్టిఫికేషన్‌ను ‘U/A’గా ఇచ్చేలా ఆదేశించాలని కోర్టును అభ్యర్థించినట్లు సమాచారం. ఈ విషయంలో మేకర్స్ చాలా ఆలస్యంగా వ్యవహరించడంతో, ఇప్పటికే తగినంత నష్టం జరిగిపోయింది. మద్రాస్ హైకోర్టు మేకర్స్‌కు అనుకూలంగా తీర్పు ఇస్తుందా..? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ చిత్రంలో నాగార్జున, ఆమిర్‌ఖాన్, ఉపేంద్ర, శ్రుతిహాసన్, సత్యరాజ్, సౌబిన్‌షాహిర్, మహేంద్రన్ తదితరులు నటించారు.