16 ఏళ్ల తర్వాత రజనీ, కమల్ మళ్లీ ఇలా..

అన్నాత్తే వెర్సస్ విక్రమ్
రజనీకాంత్–కమల్ హాసన్ బాక్సాఫీస్ వార్‌కి సిద్ధమవుతున్నారా? ప్రస్తుతం చెన్నై కోడంబాక్కమ్‌లో ఇదే హాట్ టాపిక్. వచ్చే దీపావళికి ఈ ఇద్దరి చిత్రాలు విడుదల కానున్నాయని టాక్. ప్రస్తుతం రజనీకాంత్ ‘అన్నాత్తే’ చిత్రంలో, కమల్‌హాసన్ ‘విక్రమ్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలూ దీపావళికి విడుదలవుతాయని చెన్నై టాక్. అదే నిజమైతే పదహారేళ్ల తర్వాత రజనీ–కమల్ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడినట్లు అవుతుంది. 2005లో రజనీ నటించిన ‘చంద్రముఖి’, కమల్ నటించిన ‘ముంబై ఎక్స్‌ప్రెస్’ చిత్రాలు తమిళ సంవత్సరాదికి ఏప్రిల్‌లో విడుదలయ్యాయి. ఈ దీపావళికి ‘అన్నాత్తే’, ‘విక్రమ్’ విడుదలైతే మళ్లీ పోటీపడినట్లు అవుతుంది.
ఇక.. ఈ రెండు చిత్రాల విషయానికొస్తే... తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో కొన్ని నెలలు షూటింగ్‌కి దూరంగా ఉన్న కమల్ ఈ మధ్యే మళ్లీ ‘విక్రమ్’ షూటింగ్ మొదలుపెట్టారు. అలాగే డిసెంబర్‌లో స్వల్ప అస్వస్థతకు గురయ్యాక మూడు నెలలు విశ్రాంతిలో ఉన్న రజనీకాంత్ ఇప్పుడు హైదరాబాద్‌లో ‘అన్నాత్తే’ షూటింగ్ ఆరంభించారు. శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రజనీ ఊరి పెద్దగా నటిస్తున్నారు. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో మహేంద్రన్‌తో కలసి కమల్ నిర్మిస్తున్న ‘విక్రమ్’లో కమల్ పోలీసాఫాసర్ పాత్ర చేస్తున్నారు. అటు సన్ పిక్చర్స్, ఇటు కమల్ సొంత సంస్థ రాజ్‌కమల్ ఇంటర్నేషనల్– తాము నిర్మిస్తున్న చిత్రాల రిలీజ్‌ని దీపావళికి టార్గెట్ చేశాయని సమాచారం. ఈ వార్త నిజమైతే.. దీపావళి బాక్సాఫీస్ పోటాపోటీగా ఉంటుందని ఊహించవచ్చు.
చదవండి:
ప్రియుడితో నయనతార.. ప్రత్యేక విమానంలో..
‘జాతిరత్నం’ రేటు పెరిగింది.. మూడో సినిమాకే అన్ని కోట్లా?