
‘‘త్రిబాణధారి బార్బరిక్’ చాలా కొత్త కథ.. చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది’’ అని నిర్మాత విజయ్‌పాల్ రెడ్డి అడిదల అన్నారు. సత్య రాజ్, ఉదయ భాను, వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో మారుతి సమర్పణలో విజయ్ పాల్ రెడ్డి అడిదల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది.
విజయ్‌పాల్ రెడ్డి మాట్లాడుతూ–‘‘మోహన్ చెప్పిన ‘త్రిబాణధారి బార్బరిక్’ కథ నచ్చడంతో సినిమా ఆరంభించాం. నేను ఇండస్ట్రీ కొత్త.. దీంతో డైరెక్టర్ మారుతిగారు అండగా నిలిచారు. ఇన్‌ఫ్యూజన్ బ్యాండ్ వారు మంచి పాటలు, ఆర్‌ఆర్ ఇచ్చారు. రమేష్ రెడ్డి విజువల్స్ మెప్పిస్తాయి. నైజాంలో మైత్రీవారు మా సినిమా రిలీజ్ చేస్తున్నారు.
వరంగల్‌లో ప్రదర్శించిన మా చిత్రం స్పెషల్ ప్రీమియర్ షోలో ఓ జంట ఉచితంగా చూశారు. అయితే, ఇది ఫ్రీగా చూడాల్సిన చిత్రం కాదంటూ వాళ్లు తిరిగి డబ్బులు ఇచ్చారు.. అది చూసిన తర్వాత నాకు ఎంతో సంతృప్తిగా అనిపించింది. ‘త్రిబాణధారి బార్బరిక్’ తో పాటుగా ‘బ్యూటీ’ సినిమా నిర్మించాను. ఈ రెండు సినిమాల్లో ఏ ఒక్క చోట కూడా బోర్ కొట్టదు.. ఇది నా సవాల్’’ అని చెప్పారు.