
మహానటి, కల్కి 2898 ఏడీ తదితర విజయవంతమైన చిత్రాలను నిర్మించిన నాగ్ అశ్విన్(Nag Ashwin) బిగ్ ప్లాన్‌లో ఉన్నారని తెలుస్తోంది. కల్కి 2898 ఏడీ చిత్రంలో ప్రభాస్ కథానాయకుడిగా నటించగా, నటుడు కమలహాసన్ కీలక పాత్రను పోషించారు. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రానుంది. అయితే, ప్రస్తుతం ప్రభాస్ ఇతర చిత్రాలతో బిజీగా ఉండడంతో కల్కి 2898ఏడీ సీక్వెల్ నిర్మాణం ఆలస్యం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో నాగ్ అశ్విన్ తాజాగా బాలీవుడ్ బ్యూటీ అలియాభట్‌తో ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం.
ఇలాంటి పరిస్థితిలో ఇటీవల దర్శకుడు నాగ్ అశ్విన్ కోలీవుడ్ వైపు కూడా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోది. ఇప్పటికే రజనీకాంత్‌ను ఆయన కలిసినట్లు సమాచారం. ఒక మంచి కథను ఆయనకు వినిపించారని టాక్ ఉంది. ఆ కథ నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకుని రమ్మన్నట్లు అశ్విన్‌కు రజనీకాంత్ చెప్పారట. ఈ చిత్రాన్ని తెలుగు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మించడానికి సిద్ధం అవతున్నట్లు సమాచారం. ఇటీవల తమిళ హీరోలు తెలుగు దర్శక, నిర్మాతలతో చిత్రాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారనే చెప్పాలి.

ఇటీవల బింబిసార చిత్ర దర్శకుడు విశిష్ట, వివేక్ ఆత్రేయ తదితరులు కూడా నటుడు రజనీకాంత్‌ను కలిసి కథలను వినిపించారు. అయితే వారి ప్రయత్నం ఫలించినట్లు లేదు. కూలీ చిత్రంతో కమర్షియల్ విజయం అందుకున్న రజనీకాంత్ ప్రస్తుతం జైలర్–2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. తదుపరి కమలహాసన్‌తో కలిసి లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో మల్టీస్టారర్ చిత్రం చేయనున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ తరువాతనే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించే అవకాశం ఉంది. అయితే ఈ వార్తలో వాస్తవం ఎంత అన్నది కూడా తెలియాల్సి ఉంది.