
కొందరి హీరోయిన్లకు అందం, అభినయం ఉన్నా సరే ఒక్కోసారి విజయాలు అందని ద్రాక్షే అవుతంది. నటి కృతిశెట్టి(Krithi Shetty) పరిస్థితి ఇప్పుడు అలానే ఉంది. ఉప్పెన చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ బ్యూటీ.. తొలి సినిమా తర్వాత వరుసగా విజయాలు దక్కాయి. దీంతో టాలీవుడ్‌లో దూసుకుపోతారనే ప్రచారం జరిగింది. అంతే ఆ తరువాత కృతిశెట్టి నటించిన చిత్రాలు పరాజయం పాలవడం మొదలెట్టాయి. అయితే ఆ తరువాత కోలీవుడ్‌పై దృష్టి సారించారు. అంతకుముందే తెలుగు, తమిళం భాషల్లో నటించిన ద్విభాషా చిత్రాలు ది వారియర్, కస్టడీ చిత్రాలు పూర్తిగా నిరాశపరచాయి.
అయినప్పటికీ అమ్మడికి తమిళంలో అవకాశాలు వరించాయి. అయితే అక్కడ ఈ బ్యూటీ నటించిన చిత్రాలు ఏళ్ల తరబడి నిర్మాణంలో ఉండడం గమనార్హం. తమిళంలో కృతిశెట్టి నటించిన మూడు చిత్రాలు ఇప్పుడు ఒకే నెలలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతుండడం విశేషం. వీటిలో ఏ ఒక్కటి విజయం సాధించినా కృతిశెట్టి కెరీర్‌కు హెల్ప్ అవుతుంది. దీంతో అలాంటి విజయం కోసం ఈ అమ్మడు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారనే చెప్పాలి. కార్తీకి జంటగా నటిస్తున్న వా వాద్దియార్ చిత్రం డిసెంబర్ 5న తెరపైకి రానుంది. తర్వాత ప్రదీప్ రంగనాథన్‌కు జంటగా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రంలో నటిస్తున్నారు. నిజానికి ఈ చిత్రం ఈ దీపావళికి విడుదల కావలసింది.
ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ దీపావళికి తెరపైకి రానుండడంతో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ డిసెంబర్‌కు వాయిదా పడింది. ఇకపోతే కృతి నటిస్తున్న మరో చిత్రం జీవీ. రవిమోహన్ నాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి కే.గణేశ్ నిర్మిస్తున్నారు. ఇందులో మరో నాయకిగా కల్యాణి ప్రియదర్శన్ నటిస్తున్నారు. వీటిలో నటి కృతిశెట్టి దశను మార్చే చిత్రం ఏది అవుతుందో చూడాలి.