
‘‘తెలుగులోనూ కంటెంట్ బేస్డ్ సినిమాలొస్తాయని ‘త్రిబాణధారి బార్బరిక్’ నిరూపిస్తుందన్న నమ్మకం మాకు ఉంది. ఈ తరహా చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచేలా ఈ చిత్రం ఉంటుంది. ఈ చిత్రంలోని ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉంది. క్లైమాక్స్‌ని ఎవ్వరూ ఊహించలేరు. అద్భుతమైన క్లైమాక్స్ కుదిరింది’’ అని సినిమాటోగ్రాఫర్ కుశేందర్ రమేశ్ రెడ్డి అన్నారు.
సత్యరాజ్, ఉదయభాను, వశిష్ఠ ఎన్. సింహా, సత్యం రాజేశ్ క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో మారుతి సమర్పణలో విజయపాల్ రెడ్డి అడిదెల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సినిమాకు ‘పొలిమేర, రజాకార్’ చిత్రాల ఫేమ్ కుశేందర్ రమేశ్ రెడ్డి కెమెరామేన్‌గా వర్క్ చేశారు.
‘త్రిబాణధారి బార్బరిక్’ గురించి ఆయన మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రానికి ప్రధాన బలం కథ. ‘పొలిమేర, రజాకార్’ సినిమాల కథలు విన్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో ఈ చిత్రకథ విన్నప్పుడూ అలాంటి ఫీలింగే కలిగింది. ఈ సినిమాను ఎక్కువగా రాత్రి పూట, రెయిన్ ఎఫెక్ట్స్‌లోనే షూటింగ్ చేశాం. అయితే వేసవి కాలంలో రెయిన్ సీజన్ ఎఫెక్ట్‌ని చూపించడం అంత సులభం కాదు. ఇదే మాకు పెద్ద సవాల్‌గా అనిపించింది.
ఎండాకాలంలో వానా కాలాన్ని సృష్టించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. ‘బాహుబలి’ దగ్గర్నుంచి సత్యరాజ్‌గారితో పరిచయం ఉంది. నైట్ షూట్స్, రెయిన్ ఎఫెక్ట్ సీన్లంటూ మేం ఆయన్ను చాలా ఇబ్బంది పెట్టాం (నవ్వుతూ). ఇక అల్లరి నరేశ్‌గారి ‘12ఏ రైల్వే కాలనీ’ సినిమా చేశాను. ఇటీవలే ‘కామాఖ్య’ చిత్రీకరణ ప్రారంభమైంది. ‘పొలిమేర 3’ షూటింగ్ త్వరలోనే ప్రారంభం అవుతుంది. దర్శకుడు అనిల్‌గారితో వరుస సినిమాలు ఉంటాయి’’ అని తెలిపారు.