
ముఖ్యమంత్రికి వినతిపత్రం అందచేస్తున్న సినీ ప్రముఖులు
సాక్షి, చెన్నై: సినిమాటోగ్రఫీ చట్ట సవరణను ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రి స్టాలిన్ కేంద్రమంత్రి రవిశంకర్ ప్రశాంత్‌కి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం సినిమాటోగ్రఫీ చట్టాన్ని సవరిస్తూ ఇటీవల తీర్మానం చేసిన విషయం తెలిసిందే. అయితే బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు పలువురు సినీ ప్రముఖులు చట్ట సవరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళ నిర్మాతల సంఘం అధ్యక్షుడు మురళి, నటుడు కార్తి, నటి, దర్శకురాలు రేవతి తదితరులు సోమవారం స్టాలిన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. దీంతో ముఖ్యమంత్రి స్టాలిన్ మంగళవారం మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి సినిమాటోగ్రఫీ సవరణ చట్టం గురించి చర్చించారు. చట్ట సవరణను వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు. అదే విషయాన్ని కేంద్రమంత్రి శంకర్ ప్రశాంత్‌కు లేఖ రాశారు. కాగా స్టాలిన్ చొరవ తీసుకోవడంపై తమిళ సినీ నిర్మాతల మండలి కృతజ్ఞతలు తెలుపుతూ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.