Shanmukh Jaswanth: ఓటింగ్‌లో టాప్ ప్లేస్, అయినా షణ్ముఖ్‌కు పొంచి ఉన్న ముప్పు!

బిగ్‌బాస్ షో.. ఇచట అన్ని రకాల మనస్తత్వాలు కలవారు ఉంటారు. కొందరు అందరితో ఈజీగా కలిసిపోతారు, మరికొందరు ఎవరితోనూ అసలు కలవనేలేరు. ఈ రెండో కేటగిరీ లిస్టులో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ ముందు వరుసలో ఉంటాడు. బిగ్‌బాస్ షో మొదలై నాలుగు వారాలవుతున్నా ఇప్పటికీ అతడితో కనెక్షన్ లేదని, తను గీసుకున్న గీత దాటి రావట్లేదని ఏకంగా 8 మంది ఇంటిసభ్యులు నామినేట్ చేశారు.
ఇంతవరకు నామినేషన్ జోన్‌లోకి ఎంటర్ కాని షణ్ముఖ్‌కు ఇది ఓరకంగా పెద్ద దెబ్బే అని చెప్పాలి. అయితే ఒక్కసారి నామినేషన్‌లోకి రావడంతోనే షణ్ను ప్రవర్తనలో విపరీతమైన తేడా కనిపించింది. అప్పటివరకు ఎవరికీ అంటీముట్టనట్లుగా వ్యవహరించిన అతడు నామినేషన్స తర్వాత అందరితో కావాలని మరీ తగవు పెట్టుకున్నట్లు కనిపించింది. ఇప్పటినుంచి తన ఆటేంటో చూస్తారంటూ హౌస్‌మేట్స్‌కు సవాలు విసిరాడు షణ్ను. అన్నట్లుగానే కెప్టెన్ శ్రీరామచంద్రతో కొట్లాటకు దిగాడు. తన బెస్ట్ ఫ్రెండ్ అయిన జెస్సీ మీద శ్రీరామ్ నోరు జారడంతో అతడితో వాదనకు దిగాడు. తిండి కూడా తినమంటూ సిరి, జెస్సీతో కలిసి నిరాహార దీక్షకు పూనుకున్నాడు. అయితే వారు తినేవరకు శ్రీరామ్ కూడా మెతుకు ముట్టకపోవడం గమనార్హం. అయితే తర్వాతి రోజు ఉదయాన్నే ఈ దీక్షకు చెక్ పెడుతూ షణ్ను గ్యాంగ్ టిఫిన్ ఆరగించడంతో ఈ గొడవ అక్కడితో సమాప్తమైంది.
నిజానికి షణ్ముఖ్‌కు సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇది దృష్టిలో పెట్టుకుని టాస్క్‌ల్లోనూ విజృంభిస్తే అతడికే తిరుగే ఉండదు. కానీ రూడ్ బిహేవియర్‌తో బిగ్‌బాస్ హౌస్‌లో తన జర్నీని ప్రశ్నార్థకంలో పడేస్తున్నాడు. నామినేషన్స్‌ను అస్సలు తట్టుకోలేకపోతున్నాడు. కంటెస్టెంట్ల బలాబలాలను బయటపెట్టే నామినేషన్స్‌ను పాజిటివ్‌గా తీసుకోకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఇదిలాగే కొనసాగితే వ్యవహారం రెడ్ కార్డు వెళ్తుందంటూ వార్నింగ్‌లు ఇస్తున్నారు. రెడ్ కార్డు అంటే ప్రేక్షకులు వేసిన ఓట్లతో పని లేకుండా నాగార్జున హోస్ట్‌గా తనకున్న అధికారంతో ఆ కంటెస్టెంట్‌ను నేరుగా ఎలిమినేట్ చేయడం అన్నమాట!
అయితే షణ్ను విషయంలో రెడ్ కార్డు పడే అవకాశాలు తక్కువే అంటున్నారు విశ్లేషకులు. అనధికారిక పోలింగ్స్‌లో ఎక్కువ ఓట్లతో మొదటి స్థానంలో దూసుకున్న పోతున్న అతడికి ఇలా రెడ్ కార్డుతో బ్రేక్ వేసే ఛాన్సే లేదంటున్నారు. ఏదేమైనా సైలెంట్‌గా ఉన్న షణ్నులో 4 వారాల తర్వాత ఓ కొత్త యాంగిల్ బయటకు రావడం విశేషమనే చెప్పుకోవాలి!