
తెలుగు వారికి ఆశా సైనీ (Asha Saini)గా బాగా దగ్గరైన బ్యూటీ ఇప్పుడు బిగ్‌బాస్-9లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె అసుల పేరు ఫోరా సైనీ.. 1990లో ‘ప్రేమకోసం’ సినిమాతో టాలీవుడ్‌లో నటిగా తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత 'నరసింహ నాయుడు, 'నువ్వు నాకు నచ్చావ్', 'ప్రేమతో రా,143 వంటి చిత్రాలతో తెలుగు వారికి చేరువైంది. ముఖ్యంగా నరసింహ నాయుడు చిత్రంలో బాలకృష్ణతో 'లక్స్ పాప.. లక్స్ పాప' అంటూ స్టెప్పులేసింది.
అయితే, 2011 తర్వాత తెలుగు సినిమాల్లో కనిపించలేదు. కానీ, బాలీవుడ్ పరిశ్రమలో బిజీగానే ఉంది. హిందీ వెబ్ సిరీస్‌లతో పాటు పలు సినిమాల్లొ గ్లామరస్ పాత్రలే ఎక్కువ చేస్తుంది. రానా నాయుడు, ఆర్య, X.X.X వంటి సీరిస్‌లో కాస్త గ్లామర్ డోస్ పెంచిన ఈ బ్యూటీ ఆ తర్వాత ఏకంగా ఉల్లు ఓటీటీ కోసం ఒక రొమాంటిక్ ఫిలింలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు తెలుగు బిగ్‌బాస్-9లో తన గ్లామర్ టాలెంట్‌ను చూపించేందుకు ఈ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

వివాదాలు
2008లో నకిలీ వీసా కేసులో అరెస్టు కావడం వల్ల తమిళ పరిశ్రమలో ఆమె కొంతకాలం నిషేధం ఎదుర్కొంది. తాజాగా ఆమె ఓ నిర్మాతతో తన గత సంబంధం గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. అతడు తనను చిత్రహింసలకు గురి చేశాడని, 14 నెలల పాటు ఒంటరిగా ఉంచాడని వెల్లడించింది. ఆ నిర్మాతతో ప్రేమల పడి నరకం చూశానని చెప్పింది. తన ముఖం, ఇతర ప్రైవేట్ భాగాలపై రోజూ కొట్టేవాడని ఆమె చెప్పింది. ప్రస్తుతం తన తల్లి వద్దే ఉంటున్నానని ఆమె చెప్పింది. అయితే, తాను తిరిగి వెండితెరపై కనిపించాలని ప్లాన్ చేస్తుంది. తనకు మొదట లైఫ్ ఇచ్చింది తెలుగు పరిశ్రమనే కాబట్టి మరోసారి ఇక్కడ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించే పనిలో ఆమె ఉన్నట్లు సమాచారం.
తాజాగా బిగ్‌బాస్-9 నుంచి ఒక ప్రోమో విడుదలైంది. అందులో బిగ్‌బాస్ 4వ సీజన్ విన్నర్ అభిజిత్, నాన్‌స్టాప్ (ఓటీటీ) సీజన్ విజేత బిందు మాధవి, ఫస్ట్ సీజన్ థర్డ్ రన్నరప్ నవదీప్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నట్లు చూపించారు. ఈ షో ఆగస్టు 22నుంచి సెప్టెంబర్ 5 వరకు ప్రతిరోజు హాట్‌స్టార్‌లో ప్రసారం కానున్నట్లు వెల్లడించారు. ఈ అగ్నిపరీక్షకు యాంకర్ శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరించనుంది. మరి ఈ షోలో ఎవరెవరు పాల్గొననున్నారు? ఎలా ఉండబోతోంది? అన్నది తెలియాలంటే ఇంకో 9 రోజులు ఆగాల్సిందే!