
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటించిన ఫుల్ యాక్షన్ చిత్రం 'ఏజెంట్'. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం 2023 ఏప్రిల్ 28న థియేటర్లలో రిలీజైంది. సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కించిన ఈ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు. ఇందులో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్‌గా మెప్పించింది. అయితే అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని రూ . 70 కోట్లతో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే, తాజాగా అనిల్ సుంకర ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అఖిల్ రెమ్యునరేషన్ గురించి చెప్పుకొచ్చారు.
'ఏజెంట్' సినిమా కోసం అఖిల్ ఒక్క పైసా కూడా పారితోషికం తీసుకోలేదని ఆ చిత్ర నిర్మాత అనిల్ తాజాగా పేర్కొన్నారు. సినిమా మంచి విజయం సాధిస్తే రెమ్యూనరేషన్ తీసుకుంటానని ఆయన ముందే చెప్పాడని నిర్మాత తెలిపారు. అయితే, సినిమా పెద్దగా రన్ కాకపోవడంతో అఖిల్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని అనిల్ వెల్లడించారు. ఏజెంట్ సినిమా బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 15 కోట్ల మేరకు మాత్రమే రాబట్టింది. దీంతో ఆయన భారీగా నష్టపోయారు. అదే సమయంలో 'భోళా శంకర్' ఫెయిల్యూర్ వల్ల కూడా తాను నష్టపోయానని చెప్పారు. ఆ సమయంలో తనకు చిరంజీవి కొంతమేరకు సాయం చేశారంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు.
'ఏజెంట్' సినిమా సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఈ చిత్రాన్ని భారీగానే చూశారు. ఈ చిత్రం కోసం అఖిల్ చాలా కష్టపడ్డారు. సినిమా ఫలితం తర్వాత అఖిల్ ఇలా చెప్పారు. 'మేము మా స్థాయిలో ఉత్తమంగా ప్రయత్నించాం. కానీ దురదృష్టవశాత్తూ ఈ చిత్రం తెరపై మేము కోరుకున్న విధంగా మెప్పించలేదు. మేము మీ కోసం మంచి చిత్రాన్ని అందించలేకపోయాము. నాకు పెద్ద సపోర్ట్‌గా నిలిచిన నిర్మాత అనిల్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. నన్ను నమ్మిన వారి కోసం బలంగా తిరిగి వస్తా.' అంటూ గతంలో ఆయన ఒక నోట్ విడుదల చేశారు. అఖిల్ ప్రస్తుతం లెనిన్ చిత్రంలో నటిస్తున్నారు.