పల్లె ఒక్కటే.. పంచాయతీలు రెండు
● రంగాపూర్ నుంచి దర్గాతండా విడదీసి పంచాయతీగా ఏర్పాటు
● తాజా పంచాయతీ ఎన్నికల్లో రంగాపూర్ ఏకగ్రీవం
అచ్చంపేట: అచ్చంపేట మండలంలోని రంగాపూర్ రెండు గ్రామపంచాయతీలకు నిలయంగా మారింది. ఒకే ప్రాంతంలో పైభాగంలో దర్గాతండా ఉండగా, కింది వైపు రంగాపూర్ ఉంటుంది. ఇదివరకు పంచాయతీ ఎన్నికల్లో రంగాపూర్, జయరాంనగర్‌తండా, దర్గాతండాలు కలిసి ఉండేవి. గత ప్రభుత్వం తండాలను పంచాయతీలుగా గుర్తించడంతో 2019 పంచాయతీ ఎన్నికల్లో రంగాపూర్, జయరాంనగర్‌తండా ఒకటిగా, దర్గాతండా రెండో పంచాయతీగా ఏర్పడింది. ఒకే గ్రామంగా కలిసి ఉన్న ఈ పంచాయతీ.. అధికారుల తప్పిదం వల్ల రెండుగా ఏర్పాటయ్యాయని, ఇలా విడదీయడం చట్టబద్దంగా లేదని అప్పట్లో గ్రామస్తులు నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. రోడ్డుకు ఇరువైపులా పంచాయతీలను గుర్తించినా సమస్య ఉండేది కాదని, అలా కాకుండా గ్రామంలో కొంత భాగంలో ఉన్న తండాను వీడదీసి, ఓటర్లను ఇష్టం వచ్చినట్లు కలపడం వల్ల ఇబ్బందిగా మారిందని గ్రామస్తులు వాపోయారు. రంగాపూర్ పంచాయతీ పరిధిలో 1,340 మంది ఓటర్లు, దర్గాతండాలో 1,530 మంది ఓటర్లు ఉన్నారు. మూడో విడత ఎన్నికలు జరగనున్న రంగాపూర్ సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వు కాగా ఉపసంహరణల అనంతరం ఈ పంచాయతీ ఏకగ్రీవమైంది. సర్పంచ్ అభ్యర్థి ముడావత్ సుజాత, 8 వార్డులు ఏకగ్రీవం కాగా రెండు వార్డులకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. దర్గాతండా ఎస్టీ జనరల్‌కు కేటాయించగా ముడావత్ హతీరాం, నెనావత్ శివ, ముడావత్ జ్యోతి ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. దర్గాతండాలో ముగ్గురు అభ్యర్థుల మధ్య రాజకీయం వేడెక్కగా..రంగాపూర్‌లో ఏకగ్రీవంతో స్తబ్దత నెలకొంది.
రెండు పంచాయతీల
పరిధిలో జాతర
ప్రతీ ఏటా జనవరి 17న రాత్రి రంగాపూర్ నిరంజన్ షావలీదర్గా ఉర్సు ప్రారంభమవుతుంది. దర్గాతండా పంచాయతీ పరిధిలో నిరంజన్ షావలీ దర్గా ఉండగా, ఉర్సు (జాతర) జరిగే మరో భాగం రంగాపూర్ పంచాయతీ పరిధిలో ఉంటాయి. జాతరలో వెలిసే దుకాణాలు టెంకాయల వేలం, తైబజారు వంటివి మొదలు కొన్ని జాతర ఏర్పాట్లు ఇతరత్రా కార్యక్రమాలు రెండు పంచాయతీలు పాలుపంచుకుంటున్నాయి. రంగాపూర్ రెండు పంచాయతీలుగా విడిపోవడంతో ఒకే గ్రామంలో రెండు పంచాయతీలు పనులు చేస్తున్నాయి.
ఒక్కటిగా ఉంటే బాగుండేది
పల్లె ఒక్కటే.. పంచాయతీలు రెండు


