
దివ్యాంగుల సంక్షేమానికి సర్కారు కృషి
కాళేశ్వరం: దివ్యాంగుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషిచేస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. శుక్రవారం మహాదేవపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అలీం కో సంస్థ ద్వారా దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, ఇతర ఉపకరణాలు కలెక్టర్ రాహుల్‌శర్మతో కలిసి అందజేశారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. దివ్యాంగులు సమాజంలో అన్ని రంగాల్లో రాణించేందుకు అవసరమైన సౌకర్యాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలను అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగవుతాయని అభిప్రాయపడ్డారు. మండలంలో సుమారు 200 మంది దివ్యాంగులను గుర్తించగా, మొదటి విడతలో 54 మందికి వివిధ రకాలైన బ్యాటరీ ట్రై సైకిళ్లు, సాధారణ ట్రై సైకిళ్లు, వినికిడి పరికరాలు, చేతి కర్రలు, స్టాండ్లు వారి వైకల్యాన్ని బట్టి అందిస్తున్నామన్నారు. ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఇల్లు లేని దివ్యాంగులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని తెలిపారు. అర్హులకు విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. అతి త్వరలో నూతన పెన్షన్లు మంజూరు చేస్తామని తెలిపారు. నిరుపేదలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, సన్న బియ్యం పంపిణీ, ఉచిత బస్సు సౌకర్యం, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు వడ్డీ లేని రుణాలు వంటి అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఒకొక్క హామీని నెరవేరుస్తున్నామని తెలిపారు. అనంతరం మహదేవ్పూర్ మండలానికి చెందిన 89 మంది లబ్ధిదారులకు సుమారు రూ.90 లక్షల విలువగల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అంతకు ముందు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో రూ.20 లక్షలతో నిర్మించిన బీఆర్ అంబేడ్కర్ చిల్డ్రన్ పార్క్‌ను రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్‌రెడ్డి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్‌రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయ లక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి, సీడీపీఓ రాధిక, డీఎస్పీ సూర్యనారాయణ, సీఐలు రామచందర్‌రావు, నాగార్జునరావు, ఎస్సైలు పవన్, తమాషారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అర్హులకు విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు
రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు