
పుష్కర భక్తులకు రోజూ అన్నదానం
వరంగల్ చౌరస్తా : కాళేశ్వరంలో ఈనెల 15 నుంచి 26వ తేదీ వరకు జరుగనున్న సరస్వతీనది పుష్కరాల సందర్భంగా భక్తులకు రోజూ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వాసవి ఆర్యవైశ్య నిత్యాన్నసత్రం ఉపాధ్యక్షుడు గట్టు మహేశ్ బాబు తెలిపారు. గురువారం వరంగల్ రామన్నపేట ఆర్యవైశ్య సత్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 12 రోజులపాటు కొనసాగే పుష్కరాలకు లక్షలాది మంది ఆర్యవైశ్యులు హాజరై పుష్కర స్నానం చేసి స్వామివారి సేవలో తరిస్తారన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి కుటుంబ సభ్యులతో హాజరయ్యే ఆర్యవైశ్యుల కోసం ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. సమావేశంలో సత్రం అధ్యక్షుడు సోమ రామయ్య, ఉపాధ్యక్షుడు గోరంటల యాదగిరి, ప్రతినిధులు యిరుకుళ్ల రమేశ్, ఐతా గోపినాథ్, గుముడవెల్లి సురేశ్ తదితరులు పాల్గొన్నారు.