
అవార్డు అందుకున్న కృష్ణాజిల్లా కలెక్టర్ బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ నుంచి ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ గురువారం అవార్డు అందుకున్నారు. విజయవాడలోని రాజ్ భవన్ దర్బార్ హాలులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్‌కు బంగారు పతకం, సేవా పురస్కారం అందజేసి అభినందించారు. గత సంవత్సరం బుడమేరు, కృష్ణానది వరదల్లో ప్రజలకు ఎన్నో విశిష్టమైన సేవలు అందించినందుకు గుర్తింపుగా రెడ్‌క్రాస్ ఈ అవార్డు ప్రకటించింది. జిల్లాలో రెడ్‌క్రాస్ సేవలు విస్తృతంగా అందించేందుకు నిరంతరం రెడ్‌క్రాస్ జిల్లా కమిటీకి దిశానిర్దేశాలు చేస్తూ ముందుకు నడపటం వల్ల ఈ అవార్డు ఆయనకు వచ్చింది. ఈ కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి ఎం.హరిజవహర్‌లాల్, జాయింట్ సెక్రటరీ పి.ఎస్.సూర్యప్రకాష్, ఐఆర్‌సీఎస్ చైర్మన్ వై.డి.రామారావు, సీఈఓ ఎ.కె.ఫరీదా తదితరులు పాల్గొన్నారు.
తీర గ్రామాల్లో మైరెన్ పోలీసుల పహారా
నాగాయలంక: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో దివిసీమలోని పాలకాయతిప్ప మైరెన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో కోస్టల్ సెక్యూరిటీ సిబ్బంది గురువారం సముద్ర తీరగ్రామాల్లో పహారా చేపట్టారు. సముద్ర మార్గం నుంచి ఉగ్రవా దులు జిల్లాలోకి ప్రవేశించే వీలు లేకుండా మండలంలోని ఎదురుమొండి, ఈలచెట్లదిబ్బ, నాచుగుంట గ్రామాల పరిధిలో రెండు డ్రోన్ కెమెరాల సహాయంతో మైరెన్ పోలీసులు గస్తీ నిర్వహించారు. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ కొత్త వ్యక్తుల సంచార సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని తీరగ్రామాల ప్రజలకు సిబ్బంది అవగాహన కలిగించారు.
బీచ్ ఫెస్టివల్‌కు
పకడ్బందీ ఏర్పాట్లు
చిలకలపూడి(మచిలీపట్నం): త్వరలో జరిగే బీచ్ ఫెస్టివల్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయా లని సంబంధిత అధికారులకు కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. గురువారం సాయంత్రం తన చాంబర్‌లో ఎస్పీ ఆర్.గంగా ధరరావుతో కలిసి బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేసేలా బీచ్ ఫెస్టివల్‌కు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ ఉత్సవాలకు లక్షలాది మంది ప్రజలు తరలివచ్చే అవకాశం ఉందని, వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కార్యక్రమాలన్నీ సాయంత్రం నుంచే మొదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో బీచ్ ప్రాంతంతో పాటు రోడ్ల వెంబడి విద్యుత్ దీపాలు ఎక్కువగా ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన చోట్ల సీసీ కెమెరాలు, పోలీస్ అవుట్‌పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు. సముద్రతీరం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఎన్డీఆర్ ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, డీఆర్వో చంద్రశేఖరరావు, బందరు ఆర్డీఓ కె.స్వాతి, డీఎస్పీ సీహెచ్ రాజా, మెప్మా పీడీ సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.
సత్యదేవుడికి దుర్గమ్మ పట్టువస్త్రాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): అన్నవరం సత్యనారాయణ స్వామి వారికి శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం తరఫున గురువారం పట్టువస్త్రాలను అందజేశారు. సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా దుర్గగుడి ప్రధాన అర్చకుడు లింగంభోట్ల దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకులు పట్టువస్త్రాలను అన్నవరం ఆలయానికి తీసుకెళ్లారు. స్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించిన దుర్గగుడి అర్చక బృందానికి అన్నవరం దేవస్థాన అర్చకులు, అధికారులు ప్రసాదాలను అందజేశారు.

అవార్డు అందుకున్న కృష్ణాజిల్లా కలెక్టర్ బాలాజీ

అవార్డు అందుకున్న కృష్ణాజిల్లా కలెక్టర్ బాలాజీ

అవార్డు అందుకున్న కృష్ణాజిల్లా కలెక్టర్ బాలాజీ