
శుభకార్యానికి వెళుతూ...
గుడ్లవల్లేరు: వారంతా శుభకార్యానికి హాజరయ్యేందుకు ఎంతో హుషారుగా ట్రాక్టర్‌లో బయలుదేరారు. అయితే వారి ఆనందం క్షణాల్లోనే ఆవిరై పోయింది. ట్రాక్టరు బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే ఘోరం జరిగిపోయింది. ట్రాక్టర్‌ను స్టార్ట్ చేసి అక్కడే రివర్స్ చేస్తుండగా అదుపు తప్పి బోల్తా పడటంతో అందులో ఉన్న ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండగా, మరో ఐదుగురు స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు నందివాడ మండలం రుద్రపాక వద్ద ఉన్న గాజులపాలెంలో జరిగే వివాహానికి హాజరయ్యేందుకు గురువారం గుడ్లవల్లేరు మండలం విన్నకోటకు చెందిన బంధువుల బృందం ట్రాక్టర్‌లో బయలుదేరింది. ఊరు దాటకముందే ఊళ్లోనే ట్రాక్టర్ రివర్స్ చేసే క్రమంలో అదుపు తప్పి తిరగబడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముత్యాల అరుణ్(16), కూరెళ్ల అభిషేక్(15) చికిత్స పొందుతూ మృతి చెందారు. కె.జయరాజు అనే వ్యక్తికి పొట్ట చీల్చుకుని పేగులు బయటపడటంతో గుడివాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. జయరాజుకు ఆపరేషన్ చేశాక గానీ ఏ విషయం చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఐదుగురు కూడా అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులిద్దరి భౌతిక కాయాలకు గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి ఆయా కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఏఎస్‌ఐ వి.బాల వెంకటేశ్వరరావు తెలిపారు.
ట్రాక్టర్ తిరగబడటంతో ఇద్దరు యువకుల దుర్మరణం మరొక వ్యక్తి పరిస్థితి విషమం చికిత్స పొందుతున్న మరో ఐదుగురు వ్యక్తులు

శుభకార్యానికి వెళుతూ...

శుభకార్యానికి వెళుతూ...