
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ఏటేటా పెరుగుతున్న అవసరాలు, వినియోగానికి తగినట్లు విద్యుత్ పంపిణీకి మెరుగైన ఏర్పాట్లు చేయడంలో గత టీడీపీ ప్రభుత్వం విఫలమైంది. ముందస్తు ప్రణాళికలను రూపొందించుకుని అమలు చేయకపోవడంతో వినియోగదారులకు ఇక్కట్లు తప్పలేదు. విద్యుత్ సరఫరాలో నిరంతర అవాంతరాలతో కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన లక్షలాది మంది వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. తక్షణ ఇబ్బందులను తొలగించడంతో పాటు భవిష్యత్ అవసరాలను పరిగణనలోకి తీసుకున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రెండేళ్ల కిందటే చర్యలను చేపట్టింది.
అయితే ఈ పనులు పూర్తయి విద్యుత్తు సరఫరా సక్రమంగా జరిగితే వినియోగదారుల నుంచి ప్రభుత్వానికి సానుకూలత ఏర్పడుతుందనే భావనతో ఆ గ్రామాల్లో పెద్ద రైతులుగా చలామణి అవుతున్న పలువురు పక్కా ప్రణాళిక ప్రకారం సహాయ నిరాకరణను కొనసాగిస్తున్నారు. తమతో పాటు భూములు ఇవ్వకుండా ఇతర రైతులను కూడా ఉసిగొల్పుతున్నారని సంబంధిత ఉన్నతాధికారులకు నిర్ధిష్టమైన సమాచారం ఉంది. ఇలా చేస్తున్న వారిలో ప్రతిపక్ష పార్టీకి అనుకూలురైన వారున్నారని తెలుస్తోంది.
400 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణంతో పాటు..
కృష్ణా, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో అవాంతరాలు లేని విద్యుత్తు సరఫరాకు వీలుగా కృష్ణా జిల్లా యలమర్రు వద్ద 400 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణంతో పాటు అందుకు అవసరమైన ఫీడర్, లైన్ల నిర్మాణానికి ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది. ఎంఈఐఎల్ సంస్థ కాంట్రాక్టు దక్కించుకుని పనులు చేపట్టింది. గన్నవరం, గుడివాడ, పామర్రు నియోజకవర్గాల పరిధిలోని బాపులపాడు, తేలప్రోలు, ఉంగుటూరు, ఆముదాలపల్లి, కొయ్యగూరపాడు, ముక్కపాడు, వింజరంపాడు, వెంట్రప్రగడ, చినపారుపూడి, పెదపారుపూడి మీదుగా యలమర్రుకు 400 కేవీ విద్యుత్తు లైను వెళ్లవలసి ఉంది.
రాజకీయ దురుద్దేశంతో..
విద్యుత్తు లైను నిర్మాణం జరగాలంటే నిర్ధేశిత మార్గంలోని భూమి నిర్మాణ సంస్థకు అందుబాటులో ఉండాలి. పనులకు అడ్డంకులు తలెత్తకూడదు. కానీ పై గ్రామాల పరిధిలోని రైతులు ప్రతిపక్ష పార్టీకి అనుకూలురైన పలువురు ఉద్దేశపూర్వకంగానే మోకాలడ్డుతున్నారు. మూడు జిల్లాల పరిధిలోని లక్షలాది మంది విద్యుత్తు వినియోగదారుల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నానికి సహాయ నిరాకరణ చేస్తున్నారు.
ఉన్నతాధికారుల జోక్యం అవసరం..
విద్యుత్ లైను నిర్మాణం త్వరితగతిన సాగాలన్నా, మూడు జిల్లాల వినియోగదారులకు విద్యుత్తు కష్టాలు తీరాలన్నా రెవెన్యూ, ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికై నా అధికారులు సంబంధిత నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల సహకారంతోనైనా సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పోలవరం కుడి కాలువ తవ్వకం సమయంలో..
రాష్ట్రానికి వరప్రదాయిని అయిన పోలవరం ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి అందరి కలలను సాకారం చేయాలని ఆనాటి ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తలచారు. ప్రాజెక్టు నిర్మాణం రూపుదిద్దుకునే లోపు కుడి, ఎడమ కాలువలను కూడా తవ్వించి నీటిని మళ్లించాలని పనులు ప్రారంభింపచేశారు. కుడి కాలువ పనులు ముందుకు సాగకుండా చేసే ఉద్దేశంతో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఆయాప్రాంత నాయకులు, రైతులు ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించారు. కోర్టులను ఆశ్రయించారు. భూములు ఇవ్వకుండా, కాలువ పనులను అడ్డుకోగలిగారు. కానీ భూ సమీకరణకు అంగీకరించి తమ భూములను అప్పగించిన ప్రాంతాలలో మాత్రం కాలువ తవ్వకం పనులను వైఎస్ రాజశేఖరరెడ్డి కొనసాగింపచేశారు. ఆ తర్వాత పట్టిసీమ పేరిట టీడీపీ సర్కారు చేపట్టిన ప్రాజెక్టుకు అదే రైతులు సహకరించి భూములు అప్పగించడంతో బిట్లు బిట్లుగా ఆగిపోయిన పోలవరం కుడి కాలువ పనులు పూర్తయ్యాయి. దీంతో నీటిని విడుదల చేయగలిగారు. ఇప్పుడు కూడా పోలవరం కాలువ పనులకు అడ్డంకులు సృష్టించిన రీతిలోనే విద్యుత్తు లైను నిర్మాణానికి మోకాలడ్డుతున్నారనేది తేటతెల్లం అవుతోంది.