
శిశుగృహను జేసీ, చిన్నారితో కలిసి ప్రారంభిస్తున్న కలెక్టర్ రాజాబాబు
కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబు
మచిలీపట్నంటౌన్: సమాజసేవలో బ్యాంకులు భాగస్వామ్యం కావటం అభినందనీయమని కృష్ణా జిల్లా కలెక్టర్ పి. రాజబాబు అన్నారు. పోర్టురోడ్డులోని ఐసీడీఎస్ కార్యాలయ ప్రాంగణంలో ‘శిశుగృహ’ను జాయింట్ కలెక్టర్ అపరాజితాసింగ్, చిన్నారులతో కలిసి ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఐసీడీఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శిశుగృహ అనాథ చిన్నారులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. జేసీ ప్రత్యేక చొరవతో ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ముందుకొచ్చి రూ. 4 లక్షల వ్యయంతో శిశుగృహ భవనాన్ని అభివృద్ధి చేయటం అభినందనీయమన్నారు.
39 మంది చిన్నారులను దత్తత ఇచ్చాం..
జేసీ అపరాజితాసింగ్ మాట్లాడుతూ 2011 మార్చి 1వ తేదీ నుంచి ప్రైవేటు భవనంలో శిశుగృహ నిర్వహిస్తున్నారని, ప్రస్తుతం సొంత భవనంలోకి మార్చామన్నారు. శిశుగృహ నుంచి ఇప్పటి వరకు 39 మంది చిన్నారులను దత్తత తీసుకున్నారన్నారు. ప్రస్తుతం నలుగురు చిన్నారులు ఉంటున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారిక పోర్టల్ కారా ద్వారా సీనియార్టీ ప్రకారం దత్తత స్వీకరణ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఐసీడీఎస్ కార్యాలయ ప్రాంగణంలో భవనం అసంపూర్తిగా ఉందని చుట్టూ ప్రహరీ నిర్మాణానికి నిధులు అవసరమని ఆమె కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కలెక్టర్ వెంటనే స్పందిస్తూ భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు నిధులు అందజేయాలని బ్యాంకు అధికారులను కోరారు. ఐసీడీఎస్ కార్యాలయ ప్రాంగణంలో చెత్త, చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ మునిసిపల్ కమిషనర్ చంద్రయ్యకు సూచించారు. బ్యాంకు ఉన్నతాధికారి వలివేటి శ్రీనివాస్ స్పందిస్తూ భవనాల నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు అందజేస్తే నిధులు సమకూరుస్తామని హామీ ఇచ్చారు. అనంతరం బ్యాంకు అధికారులను కలెక్టర్, జేసీ శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నగర డెప్యూటీ మేయర్ తంటిపూడి కవిత థామస్‌నోబుల్, ఆర్డీవో ఐ. కిశోర్, ఐసీడీఎస్ పీడీ ఎస్. సువర్ణ, బ్యాంకు జిల్లా మేనేజర్ కర్రి సూరెడ్డి తదితరులు పాల్గొన్నారు.