
నేడు తుంగభద్ర ఎడమ కాలువకు నీరు విడుదల
హొసపేటె: తుంగభద్ర జలాశయానికి ఎగువన ఉన్న నదీ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు జోరందుకోవడంతో డ్యాంకు వస్తున్న వరద రోజురోజుకు పెరుగుతోంది. ఈనేపథ్యంలో బుధవారం నుంచి కర్ణాటక కోటా కింద కొప్పళ, రాయచూరు జిల్లాలకు నీరందించే తుంగభద్ర ఎడమగట్టు ప్రధాన కాలువ(ఎల్‌బీఎంసీ)కు నీటిని విడుదల చేస్తున్నారు. అదే విధంగా ఈనెల 10న హెచ్‌ఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీ కాలువలకు నీటిని విడుదల చేస్తారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పరిధిలో పలు జిల్లాల ప్రజలకు, రైతులకు తాగు, సాగు నీరందించే ప్రధాన జలాశయమైన తుంగభద్ర డ్యాంకు మంగళవారం ఇన్‌ఫ్లో 33,916 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. గత వారం రోజులుగా డ్యాంలోకి భారీగా ఇన్‌ఫ్లో పెరగడంతో డ్యాంలో నీటిమట్టం కూడా క్రమంగా పెరిగింది. జలాశయానికి ఎగువన శివమొగ్గ, తీర్థహళ్లి, మొరాళు, ఆగుంబె, శృంగేరి తదితర ప్రాంతాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ప్రస్తుతం డ్యాంలో నీటిమట్టం 1624.38 అడుగులు, నీటినిల్వ 74.486 టీఎంసీలు ఉండగా ఔట్‌ఫ్లో 2,388 క్యూసెక్కులుగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
నదికి టీబీ డ్యాం నుంచి నీరు
తుంగభద్ర జలాశయంలోకి ఎగువ నుంచి ఇన్‌ఫ్లో రూపంలో 33,916 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో విద్యుత్ ఉత్పత్తి యూనిట్ ద్వారా నదిలోకి 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జలాశయం 105.788 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగి ఉండగా ప్రస్తుతం జలాశయంలో 71.790 టీఎంసీల నీరు నిల్వ చేరింది. నిపుణుల సలహా ఆధారంగా జలాశయం క్రస్ట్‌గేట్లు మార్చక పోవడంతో ఈ సంవత్సరం జలాశయంలో 80 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేయాలని నిర్ణయించారు. తుంగా, భద్ర నుంచి పెద్ద మొత్తంలో నీరు విడుదలైతే జలాశయం నుంచి నదిలోకి మరింత ఎక్కువగా నీరు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో విజయనగర, బళ్లారి, కొప్పళ, రాయచూరు జిల్లాల అధికారులకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తుంగభద్ర బోర్డు ఎస్‌ఈ నారాయణ నాయక్ హెచ్చరిక సందేశాన్ని పంపారు.
10న ఎల్‌ఎల్‌సీ, హెచ్‌ఎల్‌సీలకు
టీబీ డ్యాం నుంచి నీటి విడుదల

నేడు తుంగభద్ర ఎడమ కాలువకు నీరు విడుదల